అగ్గిపెట్టెలకు, క్యాండిల్స్ కి రూ.23 కోట్లా?
వరద ప్రభావిత ప్రాంతాల్లో చ్చేపట్టిన సహాయ చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
By: Tupaki Desk | 7 Oct 2024 4:28 AM GMTఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాల పైనా, వ్యక్తుల పైనా, వ్యవస్థలపైనా పలు దుష్ప్రచారాలు, బురద జల్లుడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం ఫ్యాక్ట్ చెక్ అని తిరిగి ప్రభుత్వాలు ఆ ప్రచారాలపై వివరణ ఇవ్వడాలు సహజమైపోయాయి. ఈ సమయంలో తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది.
అవును... ఇటీవల వరదలు ఏపీని, ప్రధానంగా విజయవాడను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... వరద ప్రభావిత ప్రాంతాల్లో చ్చేపట్టిన సహాయ చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ విషయం వైరల్ గా మారింది!
అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ. 23 కోట్లు ఖర్చు అవ్వడం ఏమిటి అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు! అయితే అదంతా తప్పుడు ప్రచారం అంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా పేర్కొన్నారు. ఇదే సమయంలో... ఈ 23 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు అయ్యిందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఇందులో భాగంగా... వరద ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక అక్కడి ప్రజలు రాత్రి సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో మొబైల్ జనరేటర్లను తరలించి సహాయ చర్యలు చేపట్టామని.. వరద బాధితులకు కొవొత్తులు, అగ్గిపెట్టెలు కూడా పంపిణీ చేశామని సిసోడియా ఓ ప్రకటనలు పెర్కొన్నారు.
వీటన్నింటికీ కలిపి రూ.23 కోట్లు ఖర్చయ్యిందని.. ఇందులో మొబైల్ జనరేటర్లకే ఎక్కువ ఖర్చు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేతప్ప సోషల్ మీడియాలో అగ్గిపెట్టేలు, కొవ్వొత్తులకే మొత్తం రూ.23 కోట్లు ఖర్చు చేశారనడం పూర్తిగా నిరాధారమని, అసత్యమని సిసోడియా తెలిపారు.