Begin typing your search above and press return to search.

తిరుమల నడక వేళ పవన్ అపసోపాలు? మరీ ఇంత చిల్లరగానా?

వేలెత్తి చూపించాలని అనుకున్నప్పుడు ఏమైనా అనేస్తాం. ఏమైనా చెప్పేస్తామన్నట్లుగా పరిస్థితి మారింది.

By:  Tupaki Desk   |   2 Oct 2024 6:21 AM GMT
తిరుమల నడక వేళ పవన్ అపసోపాలు? మరీ ఇంత చిల్లరగానా?
X

వేలెత్తి చూపించాలని అనుకున్నప్పుడు ఏమైనా అనేస్తాం. ఏమైనా చెప్పేస్తామన్నట్లుగా పరిస్థితి మారింది. మీడియాను దాటేసిన సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎవరికి ఏమనిపిస్తే ఆ మాటను అనేయటం అలవాటుగా మారింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదకొండు రోజులదీక్ష అనంతరం తన దీక్షను విరమించుకోవటం కోసం తిరుమలకు వెళ్లటం తెలిసిందే.

తిరుపతి అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గాన వెళ్లిన ఆయనపై వేస్తున్న జోకులు చూస్తే.. మరీ ఇంత చిల్లరగానా? అనిపించకమానదు. తిరుపతి నుంచి తిరుమల నడక మార్గంలో వెళ్లే వేళలో పవన్ అపసోపాలుపడ్డారని పేర్కొంటూ ఆయనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. నోటికి వచ్చినట్లుగా కామెంట్లు చేయటం కనిపిస్తుంది. తిరుమలకు నడిచి వెళ్లే ఎవరైనా సరే.. నడిచే విషయంలో ఇబ్బందులకు గురి కావాల్సిందే.

రన్నర్లు.. అథ్లెట్లు మాత్రమే ఇబ్బందికి గురి కారు. ఎందుకుంటే.. వేలాది మెట్లు ఎక్కే క్రమంతో ఇబ్బందులు తప్పవు. ఎంత ఫిట్ గా ఉన్నప్పటికీ.. రోజువారీ అలవాట్లకు భిన్నంగా వేల మెట్లు ఎక్కే క్రమంలో ఇబ్బందులకు గురవుతారు. అంతదాకా ఎందుకు? మెట్లు ఎక్కే వేళలో చెమటలు పట్టటం ఖాయం. అంతేకాదు.. అలసటకు గురవుతారు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. కానీ.. ఇలాంటి వాటిని హైలెట్ చేస్తూ.. రంధ్రాన్వేషణ చేస్తున్నట్లుగా విమర్శలు చేయటంలో అర్థం లేదనే చెప్పాలి.

మిగిలిన వారి నడకకు.. పవన్ కల్యాణ్ నడకకు మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రముఖులు ఎవరైనా నడిచే క్రమంలో.. వారు.. వారి వెంట పది మంది మాత్రమే ఉంటారు. పవన్ విషయంలో అలా కాదు. దాదాపు వందకు పైగానే నడిచారు. ఈ క్రమంలో నడిచే చోట మొత్తం మనుషులతో నిండిపోవటంతో.. ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉంటుంది. చుట్టూ ఎవరూ లేకుండా ఎవరికి వారు నడవటం ఒక లెక్క. అందుకు భిన్నంగా చుట్టూ మనుషులతో నిండిపోయిన సందర్భంలో కొండకు నడుచుకుంటూ వెళ్లటం అంత తేలికైన విషయం కాదు. ఈ మాత్రం దానికి.. ఏదో ఒకటి అనాలన్నట్లుగా మాట అనేయటం వల్ల పవన్ పలుచన కారన్న సంగతి మర్చిపోకూడదు.