కాగ్నిజెంట్ ఆఫర్ పై ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By: Tupaki Desk | 14 Aug 2024 5:15 AM GMTప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఫ్రెష్ ఇంజినీరింగ్ స్టూడెంట్లకు ఆఫర్ చేసిన జాబ్ లకు సంబంధించిన శాలరీ ప్యాకేజీ కనిష్ఠంగా ఉండటమే. కాగ్నిజెంట్ లాంటి కంపెనీ ఆఫర్ చేసిన ప్యాకేజీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రెషర్ కు ఏడాదికి 2.5 లక్షల శాలరీని ఆఫర్ చేయటంపై మండిపాటు వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. పలువురు షేర్ చేస్తూ విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు.
ఇండియన్ టెక్ అండ్ ఇన్ ఫ్రా అనే ఎక్స్ పేజీలో కాగ్నిజెంట్ తాజా జాబ్ నోటిఫికేషన్ ను షేర్ చేశారు. 2024 గ్రాడ్యుయేట్ బ్యాచ్ ఫ్రెషర్ల నుంచి క్యాంపస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించిన అప్లికేషన్లకు ఆగస్టు 14ను ఆఖరు తేదీగా కటాఫ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ పోస్టును ఆగస్టు 13న పోస్టు చేయగా.. రోజులో దాదాపు 20 లక్షల మంది చూశారు.
దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఏడాదికి రూ.2.52 లక్షల ప్యాకేజీ అంటే.. నెలకు దగ్గర దగ్గర రూ.20వేలుగా పేర్కొంటూ.. ఒక పనిమనిషి ఒక్కో ఇంట్లో అరగంట చొప్పున రోజుకు ఎనిమిది.. పది ఇళ్లలో పాచిపని చేసుకుంటే ఇంతకంటే ఎక్కువగా సంపాదించొచ్చని ఒకరు పేర్కొన్నారు.
దీనికి మరొకరు స్పందిస్తూ.. వీధిలోతోపుడు బండ్ల వ్యాపారులే నయమని.. వారే ఎక్కువగా సంపాదిస్తున్నారంటూ విమర్శలతో విరుచుకుపడ్డారు. ట్యూషన్లు చెప్పినా ఇంత కంటే ఎక్కువగా సంపాదించొచ్చన్న వ్యాఖ్యను ఇంకొకరు పోస్టు చేశారు. ఏడాదికి ఇచ్చే ఈ పాటి జీతాలతో మెట్రో నగరాల్లో ఎలా బతకాలి? ఈ డబ్బుల్ని ఏం చేసుకోవాలి? అంటూ నిలదీస్తున్నారు.