సర్కారు ఆదాయం ఢమాల్.. బాబుకు ఉక్కపోత!
దీంతో వేలాది కోట్ల రూపాయల అవసరం ఏర్పడింది. పోనీ.. ఆదాయం వస్తున్నదా..? అంటే.. వైసీపీ హయాంలో వస్తున్న ఆదాయమే ఇప్పుడు కూడా వస్తోంది.
By: Tupaki Desk | 11 Oct 2024 3:52 AM GMTఏపీ ప్రభుత్వం అసలే ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే.. గతంలో వైసీపీ ఎదుర్కొన్న సమస్యలే ఇప్పుడు కూటమి సర్కారు కూడా ఎదుర్కొంటోంది. పైకి చెప్పడానికి ఈగో అడ్డం వస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం జరుగుతున్నది ఇదే. దీనికి కారణం.. పింఛన్లు పెంచి ఇవ్వడం. పైగా.. ప్రభుత్వ మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేయడం. దీంతో వేలాది కోట్ల రూపాయల అవసరం ఏర్పడింది. పోనీ.. ఆదాయం వస్తున్నదా..? అంటే.. వైసీపీ హయాంలో వస్తున్న ఆదాయమే ఇప్పుడు కూడా వస్తోంది.
నిజానికి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదాయం పెంచాలని సీఎం చంద్రబాబు భావించారు. కానీ, ఆ తరహా వాతావరణం క్షేత్రస్థాయిలో అయితే కనిపించడం లేదు. దీంతో అప్పులు చేయక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు, రిజిస్ట్రేషన్ల ద్వారా.. ఆదాయాన్ని ప్రస్తుతానికి పెంచుకునేందు కు సర్కారు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ అధీనంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని సైతం ప్రైవేటు పరం చేస్తున్నారు. తద్వారా దరఖాస్తుల రూపంలో 1000 కోట్ల రూపాయలను రాబట్టుకోవాలని నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3365 మద్యం దుకాణాలకు(వైన్స్ మాత్రమే, బార్ కాదు) దరఖాస్తులు ఆహ్వానించారు. వీటి ద్వారా .. కనీసంలో కనీసం లక్ష దరఖాస్తులు అయినా.. వస్తాయని.. వీటి ద్వారా.. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్(తిరిగి ఇవ్వని) సొమ్ములు వస్తాయని లెక్కలు వేసుకున్నారు. ఇలా చూసుకున్నా.. 2 వేల కోట్ల రూపాయలు సర్కారు కు అందాల్సి ఉంది. కానీ, ఇప్పటికే దరఖాస్తుల గడువును ఒక సారి పొడిగించినా.. ఆశించిన మేరకు దరఖాస్తులు పడడం లేదు.
గురువారం రాత్రి 8 గంటల సమయానికి మద్యం దుకాణాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు కేవలం 800. తద్వారా.. సర్కారు వచ్చిన ఆదాయం 160,000000 రూపాయలు మాత్రమే. దీనిని బట్టి అసలు టార్గెట్ చేరుకోవడం కూడా కష్టంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కారణం.. సొంత పార్టీ నాయకులేనని చంద్రబాబు సైతం గుర్తించారు. క్షేత్రస్థాయిలో లెక్కకు మిక్కిలి దరఖాస్తులు దాఖలైతే.. తమకు అవకాశం ఉండదని భావిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్దగా దరఖాస్తులు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఈ పరిణామమే సర్కారు ఆదాయానికి గండికొడుతుండడం గమనార్హం. దీనిపై శుక్రవారం చంద్రబాబు సీరియస్ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.