బీజేపీ ఎంపీపై కబ్జా ఆరోపణలు.. కూటమిలో కలకలం!
తాజాగా దీనిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఏం చేయాలో తెలియడం లేదని తరచుగా ప్రకటనలు చేస్తోంది.
By: Tupaki Desk | 16 Jan 2025 3:30 PM GMTవైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. విశాఖపట్నం కేంద్రంగా 500 కోట్ల రూపాయలతో రుషి కొండను తొలిచేసి ఇంద్ర భవనాన్ని నిర్మించుకున్నారని టీడీపీ, జనసేన, బీజేపీలు ఆరోపించాయి. తాజాగా దీనిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఏం చేయాలో తెలియడం లేదని తరచుగా ప్రకటనలు చేస్తోంది. ఇక, ఇదే సమయంలో వైసీపీ నాయకుడు, రాజ్యసభసభ్యుడు వి. విజయసాయిరెడ్డి కుమార్తె కూడా.. భీమిలి తీరంలో ఆక్రమించి రిసార్టు కట్టుకున్నారని పేర్కొంది. దీనిని కోర్టు ఆదేశాలతో తొలగించారు.
అదేవిధంగా పలువురు వైసీపీ నాయకులు కూడా ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలు చేశారని, బలవంతంగా ప్రజల నుంచి భూములు దోచుకున్నారని.. తరచుగా ఆరోపిస్తూనే ఉన్నారు. ఇలా.. వైసీపీ హయాంలో భూముల దోపిడీపై కూటమి పార్టీల నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు కూటమి పార్టీల్లో ఒకటైన బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యుడే ఆంధ్రాయూనివర్సిటీలోని కొంత భూమిని రాత్రికి రాత్రి ఆక్రమించారంటూ.. మీడియాలో కథనాలు వచ్చాయి.
1200 కోట్ల రూపాయల విలువైన ఆంధ్రయూనివర్సిటీ స్థలాన్నిఆక్రమించుకుని అక్కడ ప్రైవేటు ప్రాజెక్టు ను నిర్మించేందుకు రాత్రికి రాత్రి ప్లాన్ చేశారన్నది ఈ కథనం సారాంశం. నేరుగా పేరు చెప్పకపోయినా.. విశాఖలోని బీజేపీ ఎంపీ అంటూ.. భారీగానే ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ భూమి వివాదంలో ఉందని.. అయితే.. కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్లు కూడా తెచ్చుకుని తమకు అనుకూలంగా బూమిని మలుచుకున్నారని సదరు మీడియా ఆధారాలతో సహా వెల్లడించింది.
ఈ పరిణామంతో కూటమి సర్కారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది నిజమైతే.. వైసీపీ నేతలపై విమర్శలు చేసే పరిస్థితి ఉండకపోగా.. రాజకీయంగా కూటమి పార్టీల మధ్య మరింత విభేదాలకు అవకాశం ఇచ్చిన ట్టు అవుతుంది. సదరు ఎంపీ రాజకీయంగా కేంద్రంలో బలంగా ఉండడంతోపాటు.. ఓ ప్రాంతీయ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నాయకుడిగా ప్రచారం జరుగుతోంది. ఈయన కు కాంట్రాక్టులు, వ్యాపారాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టినట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.