"రాజ్ మార్గ్ యాత్ర"... కారుంటే ఈ యాప్ ఉండాల్సిందే!
ఇక హైవే ఎక్కితే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ విషయంలో మరో యాప్ అవసరం అనేది తెలిసిన విషయమే!
By: Tupaki Desk | 14 Oct 2024 2:45 AM GMTకారులో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే కచ్చితంగా మ్యాప్ ఉండాల్సిందే. కొన్ని సందర్భాల్లో తెలిసిన ప్రదేశాల్లో తెలిసిన ప్రదేశానికి వెళ్లాలన్నా ట్రాఫిక్ పరిస్థితుల నేపథ్యంలో కూడా యాప్ అవసరమనుకోండి.. అది వేరే సంగతి! ఇక హైవే ఎక్కితే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ విషయంలో మరో యాప్ అవసరం అనేది తెలిసిన విషయమే!
అయితే... ప్రయాణానికి సంబంధించి మ్యాప్ కోసం, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ కోసం, ఫిర్యాదుల కోసం మరో యాప్... ఇలా ఒక్కోదానికీ ఒక్కోటి కాకుండా అన్నింటికీ కలిపి ఒకటే యాప్ ఉండే ఆలోచన చేసింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ) ఓ సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది.
అవును... జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్.హెచ్.ఏ.ఐ.) "రాజ్ మార్గ్ యాత్ర" పేరుతో ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ లో రూట్ మ్యాప్స్ నుంచి స్మార్ట్ అలర్ట్స్ వరకూ దాదాపు అన్ని ఫీచర్లూ ఉన్నాయి. అవి ఏమిటి.. ఎలా పనిచేస్తాయి.. దేనికి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం...!
ఈ రాజ్ మార్గ్ యాత్ర ప్రధానంగా... నేషనల్ హైవేస్ పై వెళ్తున్నప్పుడు ప్రయాణికులకు అవసరమయ్యే కీలక సమాచారం ఈ యాప్ లో లభిస్తుంది. ఇందులో భాగంగా... పెట్రోల్ బంక్స్, ఛార్జింగ్ స్టేషన్స్, రెస్టారెంట్స్, ఏటీఎంలు, పోలీస్ స్టేషన్లతో పాటు వాతావరణ పరిస్థితులను కూడా ఇక్కడ లభిస్తాయి.
ఇదే సమయంలో... హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో ఏవైనా ఫిర్యాదులుంటే రాజ్ మార్గ్ యాప్ లో రిపోర్ట్ చేయవచ్చు. ఇక్కడున్న ఆప్షన్ సాయంతో రహదారికి సంబంధించిన సమస్యకు సంబంధించిన ఫోటో, వీడియోను కూడా జోడించి మరీ ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుంది.
వీటితో పాటు ఫాస్ట్ టాగ్ కు సంబంధించిన సర్వీసులు ఈ యాప్ నుంచి పొందవచ్చు. ఇక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఎంటర్ చేస్తే... ఈ రహదారిలో ఉన్న టోల్ ప్లాజాల సంఖ్య, వాటి పేర్లు, కట్టాల్సిన మొత్తం చూపిస్తుంది. వీటితో పాటు... ఓవర్ స్పీడ్ నోటిఫికేషన్ సదుపాయం కూడా ఈ యాప్ లో ఉంది.
ఇలా ఎన్నో ఆప్షన్స్ తో నిండి ఉన్న ఈ యాప్... తెలుగు, ఇంగ్లిష్ తో సహా మొత్తం 12 భాషలకు సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఫోన్ నెంబర్ తో లాగిన్ అయ్యి.. ఈ సదుపాయాలన్నీ పోందవచ్చు. యాపిల్ యూజర్స్ కూ ఈ యాప్ అందుబాటులో ఉంది!