భారత్ బహు పరాక్.. పీవోకేలోకి పశ్చిమాసియా భయంకర మిలిటెంట్లు?
By: Tupaki Desk | 5 Feb 2025 11:23 AM GMTభద్రత, రక్షణపరంగా అత్యంత పటిష్ఠంగా ఉండే ఇజ్రాయెల్ పైనే భీకర దాడి చేశారు వారు.. పొరుగున శత్రుదేశం ఉన్నా దశాబ్దన్నరగా మనుగడ సాగిస్తున్నారు వారు.. ప్రపంచంలోనే అత్యంత భయకర ఉగ్రవాద సంస్థగా పేరు తెచ్చకున్నారువారు.. ఇప్పుడు అలాంటి మిలిటెంట్ సంస్థ సభ్యుల కన్ను పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)పై పడిందట. ఇజ్రాయెల్ తో 16 నెలలుగా యుద్ధం సాగిస్తున్న హమాస్ గురించి ఇదంతా. ఇజ్రాయెల్ కనికరం లేకుండా దాడులు చేయడంతో హమాస్ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకు చెందిన అగ్ర నాయకులను అందరినీ ఇజ్రాయెల్ చంపేసింది.
లిబియాలోని ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాలను, తమను ఇకమీదట సైతం ఇజ్రాయెల్ వదిలిపెట్టదన్న సంగతి తెలియడంతో హమాస్ చూపు పీవోకేపై పడిందట. భారత్ కు చెందిన భూభాగాన్ని స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లోనే పాకిస్థాన్ ఆక్రమించింది. అప్పటినుంచి దాని ఆధీనంలోనే ఉంది.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. పీవోకే ప్రజలు పాక్ పెత్తనాన్ని ధిక్కరిస్తున్నా ఆ దేశం మాత్రం పట్టించుకోవడంలేదు.
పాక్ గుప్పిట పీవోకేలోకి హమాస్ లు వస్తున్నారన్న ప్రచారంతో భారత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా బుధవారం పీవోకేలో ‘అల్ అక్సా ఫ్లడ్స్’ పేరిట రావల్కోట్ సబీర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హమాస్ సీనియర్ నేత ఖలీద్ కద్దౌమి పాల్గొంటారని ప్రకటన జరిగింది.
నిషేధిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ నేతలు సైతం రావల్కోట్ సబీర్ స్టేడియంలో జరిగిన సదస్సులో పాల్గొంటారనే కథనాలు వచ్చాయి. ఖలీద్ కద్దౌమి ప్రసంగం ఉంటుందని కరపత్రాలు, ఇతర మార్గాల్లో ప్రచారం జరిగింది.
కశ్మీర్ లో ఉగ్రవాద పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి ఖలీద్ కద్దౌమి మాట్లాడతారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. జిహాదీ సంస్థలకు బలం చేకూర్చేందుకే ఇలా చేస్తున్నట్లు అంటున్నారు.
సబీర్ స్టేడియం సభలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజర్ సోదరుడు తల్హా సైఫ్, అస్గర్ ఖాన్, ఇలియాస్ మసూద్ పాల్గొంటారని చెబుతున్నారు.
కేంద్రం హోం మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ పై మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భద్రత, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ బలోపేతం,చొరబాట్లను అడ్డుకోవడంపై దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు వాహన తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
2023 అక్టోబరులో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది. 2024 ఆగస్టులో హమాస్ నేతలతో ఖతర్ రాజధాని దోహాలో లష్కరే ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ భేటీ అయ్యాడు. లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు ఇతడు బాగా క్లోజ్. 2018లోనే సైఫుల్లాను అమెరికా ఉగ్రవాద జాబితాలో చేర్చింది.