Begin typing your search above and press return to search.

వయసును తగ్గించే ఆక్సిజన్ థెరపీ.. హైదరాబాద్ లో మొదటిసారి!

హైదరాబాద్ మహానగరంలో తొలిసారి ఒక వినూత్నమైన థెరఫీ సెంటర్ ఒకటి స్టార్ట్ అయినట్లుగా ఎలైట్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   21 Feb 2025 11:30 AM GMT
వయసును తగ్గించే ఆక్సిజన్ థెరపీ.. హైదరాబాద్ లో మొదటిసారి!
X

హైదరాబాద్ మహానగరంలో తొలిసారి ఒక వినూత్నమైన థెరఫీ సెంటర్ ఒకటి స్టార్ట్ అయినట్లుగా ఎలైట్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. డబ్బులు పుష్కలంగా ఉండి.. శరీరాన్ని మరింత షోకుగా తయారు చేసుకోవాలన్న కుతూహలం ఉన్న వారు.. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.. మరింత ఫిట్ గా.. చూసినంతనే వయసులో తక్కువన్నట్లుగా కనిపించేందుకు ప్రాధాన్యత ఇచ్చే వారిని విపరీతంగా ఆకర్షించే ఒక సెంటర్ స్టార్ట్ అయ్యింది. అప్పుడెప్పుడో వచ్చిన హాలీవుడ్ అవతార్ మూవీ చూసే ఉంటారు.

అందులో .. కొన్ని పాత్రల్ని ఒక ఛాంబర్ లాంటి దాన్లో ఉంచేయటం.. ఆ తర్వాత వారిని నిద్రాణ స్థితిలో ఉంచేసి వారిని వేరే ప్రపంచానికి పంపే థియరీ ఉంటుంది కదా. ఇది అది కాదు కానీ.. అలాంటి ఛాంబర్ లాంటిదే ఇప్పుడు చెప్పే సెంటర్ లోనూ ఉంటుంది.కానీ.. ఇది చేసే పని వేరు. ఇప్పటివరకు హైదరాబాద్ లో అందుబాటులో లేని హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీని ఇందులో అందిస్తారు. దీని ప్రత్యేకత ఏమంటే.. వంద శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ ను పీల్చుకునే వసతి ఉంటుంది.

దీంతో.. శరీరంలోని సెల్యులార్ మరమ్మతు వేగంగా జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. యాంటీ ఏజింగ్ ప్రయోజనాల్ని అందిస్తుందని చెబుతున్నారు. మీకు యాభై ఏళ్లు అనుకోండి. నలభై ప్లస్ మాదిరి కనిపించేందుకు సాయం చేస్తుందంటున్నారు. నాడీ.. జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఈ థెరపీతో రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.

ఈ తరహా చికిత్స ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పాపులర్ అయినట్లుగాచెబుతున్నారు. వైద్య నిపుణులు.. అథ్లెట్లు.. వెల్ నెస్ ఔత్సాహికులు వీటిని విస్త్రతంగా ఉపయోగిస్తున్నట్లు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రాస్ మెడికల్ ఫిట్ నెస్ సెంటర్ చెబుతోంది. ఈ ఛాంబర్ మేకిన్ ఇండియా ఉత్పత్తిగా చెబుతున్నారు. ఇప్పటికే ఇరవై మందికి తాము చికిత్స చేశామని.. సత్ఫలితాలు వచ్చినట్లుగా వెల్లడించారు.

బయట వాతావరణంలో మనం పీల్చుకునే గాలిలో 20 శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుందని.. అందులో 15 శాతాన్ని బయటకు వదిలేస్తామని.. కేవలం 5 శాతం మాత్రమే శరీరంలోకి వెళుతుందని చెబుతున్నారు. కానీ.. తాము ఏర్పాటు చేసిన ఛాంబర్ లో మాత్రం మొత్తం నూరు శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉంటుందని.. దీన్ని శరీరం పూర్తిగా పీల్చుకోవటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ప్రేరేపితం అవుతుందని చెబుతున్నారు. ఈ థెరపీతో శరీరం మీద ఉండే గీతలు తగ్గిపోవటంతో పాటు.. కణజాలం కూడా ఆరోగ్యంగా తయారవుతుందని.. ఎముకలు. కండరాలు వయసుతో పాటు కలిగే నష్టాల్ని తగ్గించే వీలుందని చెబుతున్నారు.

షుగర్ పేషెంట్లు ఏవైనా గాయాల బారిన పడినప్పుడు కానీ.. సర్జరీలు చేసిన వేళలో వారి చర్మం త్వరగా కోలుకోవటానికి ఈ థెరపీ సాయం చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. క్యాన్సర్ రోగులు కీమో థెరపీ తర్వాత.. ఈ థెరపీతో త్వరగా కోలుకుంటారని చెబుతున్నారు. ఈ చికిత్సతో ఆలసట తగ్గే వీలుంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే.. ఈ థెరపీని చేసుకోవాలని మేం చెప్పట్లేదు. ఆసక్తికరమైన విషయాన్ని మీకు షేర్ చేస్తున్నామంతే. ఒకవేళ.. ఈ థెరపీని వినియోగించటానికి ముందు.. ఒకటికి నాలుగుమార్లు దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటం.. మీకు నమ్మకమైన వైద్యుల సలహా.. సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటే మంచిది. అంతా బాగానే ఉంది కానీ.. మరి ధర మాటేమిటి? అన్న సందేహం వచ్చిందా? మాకు అదే డౌట్ వచ్చినప్పుడు.. స్పష్టమైన సమాధానం రాలేదు కానీ.. కాస్తంత ఖరీదైన వ్యవహారమే అన్న విషయం అర్థమైంది.