వందేళ్ళ ఆరెస్సెస్...బీజేపీ కి కొత్త రూట్ మ్యాప్ ?
ఈ దేశంలో అరెస్సెస్ ఎన్నో కీలక ఘట్టాలలో పాలుపంచుకుంది. ఆరెస్సెస్ ని తొలిసారి గాంధీ హత్యతో సంబంధం ఉందని నిషేధించారు.
By: Tupaki Desk | 31 Aug 2024 9:30 PM GMTరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ షార్ట్ కట్ లో ఆరెస్సెస్ ఏర్పడి 2025 సెప్టెంబర్ 27 నాటికి వందేళ్ళు పూర్తి అవుతాయి. అంటే శతాబ్ది ఉత్సవాలు ఈ ఏడాది నుంచే మొదలవుతున్నాయన్నమాట. ఆరెస్సెస్ హిందూ జాతీయ వాద సంస్థగా గుర్తింపు పొందింది. అప్పట్లో దేశంలో బ్రిటిష్ వారి పాలన సాగుతున్న నేపథ్యం ఉంది. ఆ సమయంలో హిందువులను ఐక్యంగా ఉంచాలని ఒక సంకల్పంతో డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్ర లోని నాగపూర్ కేంద్రంగా విజయదశమి శుభవేళ శ్రీకారం చుట్టారు.
ఈ దేశంలో అరెస్సెస్ ఎన్నో కీలక ఘట్టాలలో పాలుపంచుకుంది. ఆరెస్సెస్ ని తొలిసారి గాంధీ హత్యతో సంబంధం ఉందని నిషేధించారు. కానీ ఆ తరువాత ఆధారాలు లేవని తిరిగి ఎత్తేశారు. ఎమర్జెన్సీ టైం లో మరోసారి, బాబ్రీ మసీద్ కూలిన ఘటనలో మరోసారి ఇలా అనేకసార్లు ఆరెస్సెస్ ఈ దేశంలో నిషేధానికి గురి అయింది. అయినా తరువాత కాలంలో మళ్లీ బయటకు వచ్చి తన కార్యకలాపాలను యధేచ్చగా నిర్వహిస్తూ వస్తోంది.
ఆరెస్సెస్ హిందూత్వను ఒక జీవన విధానంగా ప్రచారంలోకి తెచ్చింది. మతం కాదు జీవన విధానంలో ఒకటిగా ఉన్న వారు అంతా కలసి ముందుకు సాగాలన్నది ఆరెస్సెస్ ఆలోచన. ఆరెస్సెస్ పతాకం రంగు కాషాయం. అది త్యాగానికి ప్రతిరూపం. అందుకే దానిని ఎంచుకున్నారు. ఆరెస్సెస్ కి ఆ రంగు పరమ గురువుగా ఉంటూ స్పూర్తిని ఇస్తుంది.
ఆరెస్సెస్ లో ఎన్నో అనుబంధ సంస్థలు ఉన్నాయి. వాటిని అన్నీ కలపి సంఘ్ పరివార్ గా పేర్కొంటారు. అందులో చూస్తే కనుక భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, స్వదేశీ జాగరణ మంచ్, ప్రజ్ఞా ప్రవాహ్, ఇతిహాస సంకలన సమితి, విద్యా భారతి, సంస్కార భారతి, సంస్కృత భారతి, అధి వక్తా పరిషత్, పూర్వ సైనిక పరిషత్, విశ్వ హిందూ పరిషత్, రాష్ట్ర సేవికా సమితి ముఖ్యమైనవిగా ఉన్నాయి. ఇలా ఈ అనుబంధ సంస్థలు అన్నింటిలోనూ చాలా పెద్ద సంఖ్యలో సభ్యులున్నారు. ప్రపంచంలోనే ఒక సంస్థకు నలభై లక్షలకు పైగా సభ్యులు ఉండడం ఆరెస్సెస్ కే సాధ్యం అని చెప్పాలి.
ఇక ఆరెస్సెస్ కి రాజకీయ అంగంగా భారతీయ జనతా పార్టీ ఉంది. అంటే ఆరెస్సెస్ రాజకీయంగా ఎలా ముందుకు సాగాలి అన్న దానికి బీజేపీని ఒక వేదికగా చేసుకుంటుంది అని చెబుతారు. ఆరెస్సెస్ లో అత్యున్నత పదవి సర్ సంఘ్ చాలక్. ఆయన చేతిలోనే మొత్తం వ్యవస్థ నడుస్తుంది.
అలా ఆరెస్సెస్ ని ఒక్కసారి చూస్తే 1925 నుండి 1940 వరకు ఏకంగా పదిహేనేళ్ల పాటు సర్ సంఘ్ చాలక్ గా పనిచేసినది ఆ సంస్థ వ్యవస్థాపకుడు కె.బి.హెడ్గేవార్, ఆయన తరువాత 1940 నుండి 1973 వరకు అంటే మూడున్నర దశాబ్దాల పాటు ఆ పదవిలో పనిచేసిన మాధవ్ సదాశివ్ గోల్వల్కర్ గా పేర్కొన్నాలి. ఆయన తరువాత తదుపరి 1973 నుండి 1993 వరకూ రెండు దశాబ్దాల పాటు ఆ పదవిలో పనిచేసిన మధుకర్ దత్తాత్రేయ దేవరస్. ఇలా ముగ్గురూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారత దేశమంతటా విస్తరించటానికి ఎనలేని కృషి చేశారుని చెప్పుకోవాలి.
ఇక ఆయన తరువాత 1994 నుంచి 2000 వరకూ సర్ సంఘ్ చాలక్ గా రజ్జూ భయ్యా పనిచేశారు. 2000 నుంచి 2009 వరకూ సుదర్శన్ జీ పనిచేశారు. 2009 నుంచి ఈ రోజు దాకా సర్ సంఘ్ చాలక్ గా ఉన్న వారు మోహన్ భగవత్. ఇటీవల కాలంలో ఆరెస్సెస్ కి సుదీర్ఘ కాలం పనిచేస్తున్న వారిగా మోహన్ భగవత్ ని చెప్పుకోవాలి.
ఇదిలా ఉండగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడు రోజుల జాతీయ సమన్వయ సమ్మేళనం శనివారం నుంచి కేరళలోని పాలక్కాడ్ సమీపంలోని అహలియా క్యాంపస్‌లో ప్రారంభమైంది ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే, సంయుక్త ప్రధాన కార్యదర్శులు కృష్ణగోపాల్, సిఆర్ ముకుంద్, అరుణ్‌కుమార్, రామ్‌దత్ చక్రదర్, అతుల్ లిమాయే, అలోక్ కుమార్ తదితరులు సమ్మేళనానికి హాజరయ్యారు.
ఈ కీలక సమావేశం వివిధ జాతీయ సంబంధిత అంశాలపై దృష్టి సారిస్తుంది. అంతే కాదు బీజేపీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సమావేశం కావడం ఆరెస్సెస్ వందేళ్ల ఉత్సవాలకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యం నుంచి చూసినపుడు చాలా ప్రాముఖ్యత కలిగిన భేటీగా చూడాలి.
బీజేపీకి ఆరెస్సెస్ కి మధ్య గ్యాప్ ఉందని ప్రచారం సాగుతున్న క్రమంలో ఈ భేటీ బీజేపీకి ఏమైనా దిశా నిర్దేశం చేస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. కేంద్రంలో ఆరెస్సెస్ అజెండాను అమలు చేసే విషయంలో ఏమైనా కొరతలు ఉన్నాయా లేదా అన్నది కూడా చూస్తుందా అన్న చర్చ సాగుతోంది.
మరో వైపు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడుల నేపథ్యం మీద ఆరెస్సెస్ దృష్టిని సారించింది. దేశంలో హిందుత్వ వాదం బలంగా ఉండాలని ఆరెస్సెస్ మరోసారి పిలుపు ఇస్తుంది అని అంటున్నారు. ఈ మూడు రోజుల సమావేశం బీజేపీకి ఒక రూట్ మ్యాప్ ని ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.