నాలుగైదు బ్యాంకుల్లో అప్పులు కష్టమే.. ఆర్బీఐ కొత్త నిబంధన
పర్సనల్ లోన్ల కోసం ఎదురుచూసేవారికి ఇది బ్యాడ్ న్యూస్. రుణ గ్రహీత సామర్థ్యం మేరకే రుణాలివ్వాలని భావించిన ఆర్బీఐ బ్యాంకర్లకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
By: Tupaki Desk | 4 Jan 2025 3:30 PM GMTపర్సనల్ లోన్ల కోసం ఎదురుచూసేవారికి ఇది బ్యాడ్ న్యూస్. రుణ గ్రహీత సామర్థ్యం మేరకే రుణాలివ్వాలని భావించిన ఆర్బీఐ బ్యాంకర్లకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో తక్కువ వ్యవధిలో ఒకటికి మించి బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం కుదరదని బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి.
వ్యక్తిగత అవసరాల కోసం చాలా మంది బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు తీసుకుంటుంటారు. ఇవి తీర్చక ముందే ఇంకేదో అవసరం ఉందని మరో బ్యాంకునూ ఆశ్రయిస్తుంటారు. బ్యాంకుల మధ్య క్రెడిట్ సమాచారం పంచుకోవడంలో జాప్యం కారణంగా ఇలాంటి వారి సామర్థ్యానికి మించి లోన్లు మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. దీనివల్ల రుణ గ్రహీతలు అప్పు తిరిగి తీర్చడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ అదుపు తప్పి మరిన్ని అప్పుల పాలు అవుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్బీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది. బ్యాంకుల రుణ సమాచారాన్ని పంచుకునే వ్యవధి 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది. దీనివల్ల ఒక బ్యాంకులో లోన్ ఉన్నవారు, ఈఎంఐ సకాలంలో చెల్లించని వారి సమాచారం మిగతా బ్యాంకర్లకు త్వరితగతిని తెలిసిపోతుంది. ఫలితంగా కొత్త రుణాలు ఇచ్చే విషయంలో ఆచితూచి స్పందించే అవకాశం ఉందంటున్నారు.
ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకారం బ్యాంకులు తమ రుణ రికార్డులను ప్రతి 15 రోజులకు ఒకసారి వెల్లడించాల్సివుంటుంది. గతంలో ఈ గడువు 30 రోజులు ఉండేది. తరచూ రికార్డులు అప్డేట్ అయితే రుణ గ్రహీతల సమాచారంపై ఎక్కువ తనిఖీలు జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒకే సమయంలో వేర్వేరు బ్యాంకుల్లో లోన్లు పొందే వీలు ఉండదని అంటున్నారు.
రుణ స్వీకర్తలు నష్టపోకుండా ఉండాలనే ఆలోచనతోనే రిజర్వు బ్యాంకు ఈ నిబంధన తీసుకువచ్చింది. వాస్తవానికి ఆగస్టులోనే ఈ ఆదేశాలు జారీ చేసినా, బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోల వెసులుబాటు కోసం ఈ జనవరి వరకు వాయిదా వేసింది. ఈ నెల 1 నుంచి ఈ నిబంధన కచ్చితంగా పాటించాలని సూచించడంతో ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి రుణాలపై సమాచారం వెల్లడించాల్సివుంటుంది.
వేర్వేరు రుణాలకు చెందిన ఈఎంఐలు ప్రతి నెలా వేర్వేరు తేదీల్లో ఉండొచ్చు. నెల రోజులకోసారి ఆర్థిక సంస్థలురుణ సమాచారం వెల్లడించడం వల్ల బకాయిలు తిరిగి చెల్లించని, ఎగవేతదారుల సమాచారం పంచుకోడానికి 40 రోజుల సమయం పడుతోంది. 15 రోజుల రిపోర్టింగ్ వల్ల ఈ ఆలస్యం లేకుండా నివారించొచ్చని భావిస్తున్నారు. తమ రుణ చెల్లింపు సామర్థ్యానికి మించి పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాజా నిబంధన వల్ల ప్రజలు అధిక రుణాలు తీసుకోకుండా అడ్డుకోవచ్చని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.