Begin typing your search above and press return to search.

విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్... డ్రోన్ అనుకుని రష్యా కాల్పులు?

అవును... అజర్ బైజన్ లోని బాకు నగరం నుంచి రష్యా లోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్ని కి ప్రయాణిస్తుండగా.. కజికిస్తాన్ లోని ఆక్టావ్ లో ఈ విమానం కూలిపోయింది.

By:  Tupaki Desk   |   26 Dec 2024 7:21 AM GMT
విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్... డ్రోన్ అనుకుని రష్యా కాల్పులు?
X

కజకిస్థాన్ లో అజర్ బైజన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జే2-8243 అనే ఈ విమానం కుప్పకూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 38 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు!

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రమాదం జరిగిన తర్వాత కనిపిస్తున్న విమానం ఫోటోలు కొత్త చర్చకు తెరలేపాయి. ఇందులో భాగంగా... విమానం బాడీపై రకరకాల సైజుల్లో హోల్స్ పడి ఉన్నాయి. ఇదే సమయంలో విమానం లోపలా ప్రమాదానికి ముందే చెల్లచెదురుగా పరిస్థితి ఉందని అంటున్నారు.

వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఆన్ లైన్ లో ప్రత్యక్ష మవ్వగా.. అవి వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో... ఈ విమాన ప్రమాదానికి పొగమంచో, పక్షిని ఢీకొనడమో కారణం కాదని.. ఈ ప్రమాదానికి రష్యానే కారణం అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది.

అవును... అజర్ బైజన్ లోని బాకు నగరం నుంచి రష్యా లోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్ని కి ప్రయాణిస్తుండగా.. కజికిస్తాన్ లోని ఆక్టావ్ లో ఈ విమానం కూలిపోయింది. దీంతో... పక్షి తగలడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ పేర్కొంది.

అయితే.. ప్రమాద దృశ్యాలనూ, ప్రమాదానికి ముందువిగా చెబుతున్న పలు వీడియోలను చూసిన నెటిజన్లు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం... రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు జరగడమే అని అంటున్నారు. ఈ విమానాన్ని ఉక్రెయిన్ కు చెందిన డ్రోన్ గా భావించడం వల్లే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చేసినట్లు అనుమానిస్తున్నారు.

ఈ సందర్భంగా... ఉక్రెయిన్ డ్రోన్ ల దాడులును రష్యా తిప్పుకొడుతున్న సమయంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని కొన్ని పత్రికల కథనాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో... వైరల్ అవుతున్న కొన్ని ఫోటోల్లో విమానం బాడీపై బుల్లెట్ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించాయి. దీంతో.. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.