Begin typing your search above and press return to search.

మహామ్మారుల పుట్టిల్లు చైనాలో పిల్లులకు కొత్త వైరస్

ఇలాంటి సమయంలో తమ పెంపుడు పిల్లలకు కూడా కరోనా వంటి వైరస్ సోకడంపై చైనీయులు ఆందోళన చెందుతున్నారు.

By:  Tupaki Desk   |   4 Jan 2025 11:30 PM GMT
మహామ్మారుల పుట్టిల్లు చైనాలో పిల్లులకు కొత్త వైరస్
X

రకరకాల వైరస్లకు పుట్టిల్లు అయిన చైనాలో పిల్లులకు ఓ కొత్త వైరస్ సోకుతోంది. దీంతో వాటికి మనుషులకిచ్చే కొవిడ్ మందులను ఇస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ప్రస్తుతం చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ (HMPV) అనే కొత్తరకం వైరస్ సోకుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తమ పెంపుడు పిల్లలకు కూడా కరోనా వంటి వైరస్ సోకడంపై చైనీయులు ఆందోళన చెందుతున్నారు.

కొద్దిరోజులుగా చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ ధాటికి జనం ఇంటి నుంచి రావడానికి భయపడుతున్న వేళ, ఆ దేశంలో పిల్లులకు ‘ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్’ అనే ప్రాణాంతక వైరస్ సోకుతోందని చైనా మీడియా వెల్లడించింది. తమ పెంపుడు పిల్లులు ఈ వ్యాధి బారిన పడకూడదనే ఉద్దేశంతో కొంతమంది వాటికి మనుషులు వాడే కోవిడ్ మందులను ఇస్తున్నారు. ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్ అనే వైరస్ కేవలం పిల్లులకు మాత్రమే వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్ అంటున్నారు.

ఈ వైరసును ఫీలైన్ కరోనా వైరస్ అని కూడా పిలుస్తుంటారు. ఇది పిల్లుల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వైరస్ పిల్లి శరీరం అంతటా వ్యాపించే ముందు వాటి తెల్ల రక్త కణాలను నాశనం చేస్తుంది. దీనివల్ల వాటికి ప్రాణాపాయం వాటిల్లుతోంది. ఈ వైరస్ లక్షణాలు అన్నీ కరోనాను పోలినట్లు ఉంటున్నాయి. దీంతో పిల్లులకు ఖరీదైన మందులు కొనుగోలు చేయాల్సివస్తోందట. అయితే ఈ వైరస్ ను అరికట్టిందుకు మనుషులు వాడే కరోనా మందులు బాగా పనిచేస్తున్నాయని తెలుసుకుని అంతా ఆ మందులనే ప్రిఫర్ చేస్తున్నారు.

పిల్లుల కోసం ప్రత్యేకంగా తయారు చేసే మందులు ఖరీదైనవి కావడంతో మనుషులకు ఇచ్చే మందులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ఈ మందులు వాడటం వల్ల వైరస్ బారిన పడిన పిల్లులు ఆరోగ్యం మెరుగమవుతుందని తాము గుర్తించినట్లు కొంతమంది నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలియజేశారు. అయితే ఈ పద్ధతిని మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మనుషులకు ఇచ్చే మందులు పెంపుడు జంతువులకి ఇవ్వడం వల్ల వాటి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారని మండిపడుతున్నారు.

చైనాలో ప్రస్తుతం హెచ్ఎంపీవీ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలతో ప్రజలు పెద్దఎత్తున ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో మళ్లీ కోవిడ్ లాక్ డౌన్ వంటి పరిస్థితులు తలెత్తుతాయోమనని చైనీయులు టెన్షన్ పడుతున్నారు. ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే హెచ్ఎంపీవీ లక్షణాలు ఉంటున్నాయి. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోందని చెబుతున్నారు. అయితే ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రులకు క్యూకడుతున్నా చైనా ప్రభుత్వం మాత్రం వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంటోందని చెబుతుండటం గమనార్హం.