Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ వేళ అమెరికాలో ఉగ్రచర్య? 10 మంది మృతి!

ఈ ఘటన వెనుక ఉగ్రచర్య ఏమైనా ఉందా? అన్న కోణంలో ఎఫ్ బీఐ విచారణ జరుపుతోంది. దుండగుడ్ని టెక్సాస్ కు చెందిన 42 ఏళ్ల షంషుద్దీన్ జబ్బార్ గా అధికారులు గుర్తించారు.

By:  Tupaki Desk   |   2 Jan 2025 4:58 AM GMT
న్యూ ఇయర్ వేళ అమెరికాలో ఉగ్రచర్య? 10 మంది మృతి!
X

కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకున్న ఒక బీభత్స ఘటన షాకింగ్ గా మారింది. న్యూ ఆర్లీన్స్ లో నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఒక దుండగుడు ఒక పికప్ ట్రక్ తో బీభత్సాన్ని క్రియేట్ చేశాడు. ఈ దారుణ ఘటనలో 10 మంది మృతి చెందగా.. 33 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనేపై బోలెడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రచర్యలో భాగంగా ఈ ఘటన జరిగిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారణం.. జనంపైకి విచక్షణరహితంగా వాహనాన్ని నడిపిన ఆ కసాయి.. ఆపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడగా.. ప్రతిగా జరిపిన కాల్పుల్లో సదరు ఆగంతుకుడు హతమయ్యాడు.

ఈ ఘటన వెనుక ఉగ్రచర్య ఏమైనా ఉందా? అన్న కోణంలో ఎఫ్ బీఐ విచారణ జరుపుతోంది. దుండగుడ్ని టెక్సాస్ కు చెందిన 42 ఏళ్ల షంషుద్దీన్ జబ్బార్ గా అధికారులు గుర్తించారు. అతను అమెరికా పౌరుడిగా తేల్చారు. అయితే.. అతడి వాహనంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన జెండా లభించింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని న్యూఆర్లీన్స్ లోని బార్బన్ స్ట్రీట్ కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచంలోనే ఫేమస్. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా వేలాది మంది ఈ వేడుకులకు తరలివచ్చారు.

ఈ దారుణ ఘటనపై ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన నడిచి వెళుతున్న జనంపైకి వాహనం దూసుకొచ్చిందని.. అనంతరం కాల్పులు వినిపించినట్లుగా పేర్కొన్నారు. వాహనం ఢీ కొనటంతో ఒక వ్యక్తి ఎగిరి తనపైకి దూసుకొచ్చినట్లుగా ఒకరు వెల్లడించారు. మరో ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. తాను క్లబ్ నుంచి బయటకు వచ్చానని.. జనం పరుగెత్తుకుంటూ వస్తున్నారని.. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరిస్తున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఈ దారుణ ఘటనకు సమీపంలోని ప్రాంతంలో ఒకస్టేడియం ఉంది. అక్కడ పుట్ బాల్ మ్యాచ్ ఉండటంతో మరింత మంది ఈ ప్రాంతానికి ముందుగా తరలి వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3.15 గంటల వేళలో వారంతా సంబరాల కోసం రోడ్లపైన ఉన్న వేళలో. దుండగుడు పికప్ ట్రక్ తో వారిపైకి దూసుకెళ్లాడు. దీంతో అక్కడి వారు హాహాకారాలు చేశారు. తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. మొత్తంగా పది మంది ప్రాణాలు పోగా.. 33 మంది గాయపడ్డారు.

దాడి అనంతరం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దాడి నేపథ్యంలో పుట్ బాల్ మ్యాచ్ జరిగే స్టేడియంను బుధవారం ఉదయం మూసేశారు. గాయపడిన వారిని అక్కడికి దగ్గర్లోని ఐదు ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు ఇజ్రాయెలీలు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని వెల్లడించేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో తొలుత పరస్పర విరుద్ద వాదనలు తెరపైకి వచ్చాయి.

జరిగిన దారుణం ఉగ్రదాడిగా న్యూఆర్లీన్స్ మేయర్ లాటోయా కాంట్రెల్ తెలపగా.. ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిగా పోలీసు చీఫ్ అభిప్రాయపడ్డారు. అయితే.. జరిగింది ఉద్రదాడి కాదని ఎఫ్ బీఐ అధికారి అలెతియా డంకన్ తొలుత ప్రకటించినా.. దాన్ని ఉగ్రదాడి కోణంలోనూ దర్యాప్తు జరుపుతామని పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు పోలీసుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఉగ్రకోణంలోనూ ఎఫ్ బీఐ దర్యాప్తు చేస్తుందని తెలిపిన ఆయన. ప్రతి అంశాననీ పరిశీలించి ఏం జరిగిందో తెలుసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించినట్లుగా ఆయన పేర్కొన్నారు. కొత్త సంవత్సర వేడుకల్నిజరుపుకోవటానికి వచ్చిన వారు విగత జీవులుగా మారడంతో తన మనసు బరువెక్కిపోయినట్లుగా పేర్కొన్నారు.