Begin typing your search above and press return to search.

అమెరికా ఎన్నికలపై న్యూయార్క్ టైమ్స్ పోల్.. అధిక్యత ఎవరిందటే?

తాజా సర్వే ఫలితాల ప్రకారం దేశ వ్యాప్తంగా దాదాపు 48 శాతం మంది ట్రంప్ నకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   10 Sep 2024 4:57 AM GMT
అమెరికా ఎన్నికలపై న్యూయార్క్ టైమ్స్ పోల్.. అధిక్యత ఎవరిందటే?
X

అంతకంతకూ హోరాహోరీగా మారుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఏ రీతిలో ఉండనున్నాయి? అన్న అంశంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతూ ఉంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధికార డెమోక్రాటిక్ అభ్యర్థిగా ప్రస్తుతం ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమలా హారిస్ బరిలో ఉండటం తెలిసిందే. వీరిద్దరి మధ్య పోటీ తీవ్రంగా మారింది. ఎవరికి వారు తగ్గకుండా ఉండటమే కాదు.. ఎన్నికల వేళ సర్వశక్తుల్ని ఒడ్డుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా మీడియా సంస్థలు అధ్యక్ష ఎన్నికల్లో అధిక్యత ఎవరిదన్న దానిపై పోల్ సర్వేలు నిర్వహిస్తున్నారు.

తాజాగా అమెరికాలో దిగ్గజ మీడియా సంస్థగా పేరున్న న్యూయార్క్ టైమ్స్ పోల్ సర్వేను నిర్వహించారు. ఈ సంస్థతో పాటు సియానా సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇందులో కమలా హారిస్ కంటే స్వల్ప అధిక్యతలో ట్రంప్ ఉన్నట్లుగా తేలింది. అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ విధానాలు.. తీరుపై ఇప్పటికే బోలెడెన్ని విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ.. ఆయన వైపు ఓటర్లు మొగ్గు చూపినట్లుగా పేర్కొన్నారు.

ఆస్తుల్ని ఎక్కువ చేసి చూపించి.. రుణాలు పొందటం.. పార్లమెంట్ పైకి తన మద్దతుదారుల్ని ఊసిగొల్పిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ ట్రంప్ ను సగం కంటే ఎక్కువ మంది మద్దతు పలుకుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. తాజా సర్వే ఫలితాల ప్రకారం దేశ వ్యాప్తంగా దాదాపు 48 శాతం మంది ట్రంప్ నకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.

ట్రంప్ తో పోలిస్తే కమలా హారిస్ స్వల్పంగా వెనుకబడి ఉన్నారు.విస్కాన్సిన్.. మిషిగన్.. పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో కమలా హారిస్ అధిక్యతను ప్రదర్శించారు. నెవడా.. జార్జియా.. నార్త్ కరోలినా.. అరిజోనాలో ఇద్దరికి గట్టి పోటీ ఉన్నట్లుగా వెల్లడైంది. మిషిగన్.. విస్కాన్సిన్ లో హారిస్ ఒక శాతం అధిక్యతను ప్రదర్శించారు. పెన్సిల్వేనియాలో ఇరువురికి మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఇక.. ఇప్పుడు ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత కాలమానం ప్రకారం చూస్తే.. ఈ బిగ్ డిబేట్ బుదవారం ఉదయం 6.30 గంటలకు షురూ కానుంది. ఆసక్తి ఉన్న వారు.. ఏబీసీ న్యూస్ పోర్టల్ లైవ్ లో ఈ బిగ్ డిబేట్ ను వీక్షించే వీలుంది. 90 నిమిషాల పాటు సాగే.. ఈ బిగ్ డిబేట్ ఫలితం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.