తెలంగాణలో బీర్ వార్..అసలేం జరిగింది?
తెలంగాణ సర్కారులో బీర్ వార్ షురూ అయ్యిందా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 28 May 2024 4:35 AM GMTతెలంగాణ సర్కారులో బీర్ వార్ షురూ అయ్యిందా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం కొత్త బ్రాండ్ల మద్యం సరఫరా కోసం తెలంగాణలో ఎవరూ అప్లికేషన్లు పెట్టుకోలేదని సదరు శాఖా మంత్రి జూపల్లి క్రిష్ణారావు చెప్పటం తెలిసిందే. ఆయన నోటి నుంచి ఈ మాట వచ్చి వారం కూడా కాలేదు. కానీ.. అందుకు భిన్నంగా తమ కంపెనీకి సంబంధించిన ప్రముఖ బీర్ బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేసేందుకు అక్కడి ప్రభుత్వం తకు అధికారికంగా అనుమతులు ఇచ్చాయని పేర్కొంటూ మధ్యప్రదేశ్ కు చెందిన ‘‘సోం డిస్టలరీస్’’ ప్రకటించింది.
సదరు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజికి సైతం సమాచారాన్ని ఇచ్చింది. బీర్ వినియోగంలో దేశంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి తెలంగాణ. ఈ నేపథ్యంలో తమ అమ్మకాల్ని పెంచుకోవటానికి.. కంపెనీ విస్తరణకు గణనీయమైన అవకాశం వచ్చినట్లుగా సోం డిస్టలరీస్ స్టాక్ ఎక్స్ఛేంజికి సమాచారం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రావటం కీలక అడుగ్గా పేర్కొన్న సదరు కంపెనీ.. ఆ రాష్ట్రంలోని డిమాండ్ కు అనుగుణంగా బీరు సరఫరా చేయటానికి అవకాశం చిక్కినట్లుగా పేర్కొంది.
తాజా అనుమతితో తమ బీర్ బ్రాండ్ల అమ్మకాలు భారీగా పెరుగుతాయని పేర్కొంది. ఈ లేఖలో తెలంగాణ ప్రభుత్వం తమకు ఎప్పటి నుంచి సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇదే సమయంలో తెలంగాణలో కొత్త బ్రాండ్ల బీర్లు అందుబాటులోకి రానున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
‘‘పవర్ 10000; బ్లాక్ ఫోర్ట్; హంటర్ స్ట్రాంగ్; వుడ్ పెకర్; హంటర్ బ్రాండ్’’ బీర్లు త్వరలో అందుబాటులోకి రానున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో.. సంబంధిత శాఖా మంత్రికి తెలీకుండా బీర్ అనుమతుల్ని ప్రభుత్వం ఎలా ఇచ్చింది? అన్నది ప్రశ్నగా మారింది. ఇదే సమయంలో నాసిరకం బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశ పెట్టటానికి వీలుగా రేవంత్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించటం గమనార్హం.
రాష్ట్రంలో గడిచిన కొద్ది వారాలుగా బీర్ కొరత ఉందన్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల వేళలో కొన్ని ప్రముఖ బీర్ బ్రాండ్లు రాష్ట్రంలో లభించలేదన్న వార్తలు భారీగా వచ్చాయి. అయితే.. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదన్న కారణంగా ఆయా సంస్థలు తమ సరఫరాను ఆపేసినట్లుగా చెబుతున్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని ఒక్కొక్కటిగా తమ ప్రభుత్వం తీరుస్తున్నట్లు మంత్రి జూపల్లి ఈ మధ్యన నిర్వహించిన మీడియా భేటీలో వెల్లడించారు.
అంతేకాదు.. ప్రభుత్వ పాలసీల్లో ఏదైనా మార్పు ఉంటే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని వివరించారు. కొత్తబీర్ బ్రాండ్లను మార్కెట్ లోకి ప్రవేశ పెట్టటానికి వీలుగానే కొంతకాలంగా ప్రముఖ బ్రాండ్ల బీర్ సరఫరాను నిలిపేసినట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ.. కొత్త బ్రాండ్ల మద్యానికి రాష్ట్రంలో అవకాశం ఇవ్వలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్దం చెబుతున్నారని, సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే తెలంగాణలో బీర్లు అమ్మేందుకు సోం డిస్టిలరీస్ కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి డీల్ చేసి.. అనుమతి ఇచ్చారా? అని ప్రశ్నించటం గమనార్హం. మొత్తంగా ముఖ్యమంత్రికి మంత్రికి మధ్య లొల్లి పెట్టేందుకు బీర్ ఎపిసోడ్ ను ఒక అస్త్రంగా విపక్ష నేతలు వాడుతున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది.