Begin typing your search above and press return to search.

మధ్యప్రదేశ్ సీఎంగా కొత్త ముఖం.. బీసీకి చాన్స్.. శివరాజ్ కు రాంరాం!

దాదాపు 19 ఏళ్లు.. మధ్యలో కొన్నాళ్లు తప్ప మధ్యప్రదేశ్ సీఎం పీఠం బీజేపీదే.. 2018లో ఓటమిపాలైన రెండేళ్లకే తిరిగి అధికారం చేజిక్కించుకుంది కమలం పార్టీ.

By:  Tupaki Desk   |   11 Dec 2023 12:30 PM GMT
మధ్యప్రదేశ్ సీఎంగా కొత్త ముఖం.. బీసీకి చాన్స్.. శివరాజ్ కు రాంరాం!
X

దాదాపు 19 ఏళ్లు.. మధ్యలో కొన్నాళ్లు తప్ప మధ్యప్రదేశ్ సీఎం పీఠం బీజేపీదే.. 2018లో ఓటమిపాలైన రెండేళ్లకే తిరిగి అధికారం చేజిక్కించుకుంది కమలం పార్టీ. ఇక 2005లో మొదలైన వారి గెలుపు యాత్ర మొన్నటి ఎన్నికల వరకు సాగింది. తొలినాళ్లలో ఫైర్ బ్రాండ్ నేత ఉమా భారతిని ముఖ్యమంత్రిని చేసినా.. ఆపై శివరాజ్ సింగ్ చౌహాన్ ను పీఠంపై కూర్చోబెట్టింది. అప్పటినుంచి కూడా ఆయనే. దాదాపు 15 ఏళ్లు సీఎంగా పనిచేసి ఉంటారు శివరాజ్. బీజేపీ తరఫున అత్యధిక కాలం సీఎంగా ఉన్నది ఆయనే కావడం విశేషం. కానీ, ఈసారి మాత్రం మధ్యప్రదేశ్ కు కొత్త సీఎంను ఎంచుకుంది బీజేపీ. ఒక బీసీ అభ్యర్థికి చాన్సిచ్చింది.

సమ్మోహన పరుస్తాడా?

మోహన్ యాదవ్.. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో తప్ప మిగతా రాష్ట్రాల వారికి తెలియని నాయకుడు. కానీ, ఇప్పుడు దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. బీజేపీ అధిష్ఠానం ఆయనను శివరాజ్ స్థానంలో ఎంపిక చేసింది. 58 ఏళ్ల మోహన్ యాదవ్ ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచారు. ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన ఉజ్జయిని నుంచి మూడు సార్లు గెలిచారు. ఈయన మొన్నటి ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖను నిర్వర్తించారు. అలా శివరాజ్ కేబినెట్ లో మంత్రిగా ఉండి.. ఇప్పుడు ఏకంగా సీఎం అవుతున్నారు.

గెలుపే కాదు.. సీఎం ఎంపికా అనూహ్యమే

మధ్యప్రదేశ్ లో గత ఎన్నికల్లో ఓడి దొడ్డిదారిన అధికారం పొందిన బీజేపీ.. ఈసారి గెలవడం చాలా కష్టమని సర్వేలు తేల్చిచెప్పాయి. కానీ, దానిని తారుమారు చేస్తూ.. శివరాజ్ సింగ్ సారథ్యంలోని బీజేపీ సర్కారు అధికారం నిలబెట్టుకుంది. అయితే, ఫలితలు వెలువడి 9 రోజులు అవుతున్నా సీఎం ఎవరనేది మాత్రం తేల్చలేకపోయింది. సోమవారం సాయంత్రాంనికి ఈ సస్పెన్స్ కు తెరదించింది. మోహన్ యాదవ్ ను సీఎంగా ప్రకటించింది. ఇలా గెలుపే కాదు.. సీఎంనూ అనూహ్యంగా ఎంపిక చేసింది.

శివరాజ్ రాంరాం.. అందుకేనా..

మధ్యప్రదేశ్ ఆపద్ధర్మ సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ రెండు రోజుల కిందట "రాం రాం" అంటూ ట్వీట్ చేశారు. ..ఇక సెలవు అనే అర్థంలో ఈ ట్వీట్ ఉండడంతో కలకలం రేగింది. అందుకుతగ్గట్లే ఆసారి ఆయనకు సీఎం పీఠం దక్కలేదు. వాస్తవానికి శివరాజ్ తప్ప మరో నాయకుడిని బీజేపీ సీఎం చేస్తుందని భావించలేదు. దీన్నంతటినీ పక్కనపెట్టింది ఆ పార్టీ అధిష్ఠానం. జగ్దీష్ దేవ్ రా, రాజేశ్ శుక్లాలను డిప్యూటీ సీఎంలుగా ప్రకటించింది. కాగా.. మధ్యప్రదేశ్ లో మరో బలమైన నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియానూ సీఎం చేయకపోవడం గమనార్హం. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేసిన నరేంద్ర సింగ్ తోమర్ ను మధ్యప్రదేశ్ స్పీకర్ గా ఎంపిక చేయడం గమనార్హం.