కమ్మ సామాజికవర్గం వాటా...కాంగ్రెస్ లో కొత్త డిమాండ్
కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి నాయకత్వంలో కీలక నేతలు అంతా ఢిల్లీలో తమ సామాజికవర్గానికి సీట్లు కావాలని కాంగ్రెస్ పెద్దలను కోరబోతున్నారు.
By: Tupaki Desk | 6 Oct 2023 12:24 PM GMTఎన్నికలు అంటే కులాలు మతాలు ప్రాంతాలు అన్నీ మిళితం అయి ఉంటాయి. ఏ కులానికి ఎన్ని సీట్లు ఇవ్వాలని ఎంచి మరీ రాజకీయ పార్టీలు ఇస్తుంటాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో అయితే చాలా పంచాయతీలు ఉంటాయి. కులాల రగడ నుంచి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇపుడు తెలంగాణా కాంగ్రెస్ లో ఒక బలమైన వర్గంగా ఉన్న కమ్మ సామాజికవర్గం తన కోటాగా వాటాగా ఒక నంబర్ చెప్పి సీట్లను డిమాండ్ చేస్తోంది
ఈ సీట్లు ఇవ్వాలంటూ ఏకంగా హై కమాండ్ వద్దకు ఢిల్లీకి ఒక టీం బయల్దేరి వెళ్ళింది. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి నాయకత్వంలో కీలక నేతలు అంతా ఢిల్లీలో తమ సామాజికవర్గానికి సీట్లు కావాలని కాంగ్రెస్ పెద్దలను కోరబోతున్నారు
ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సీన్ ఉంది. రెండు మూడు రోజులలో అది రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ లో సీట్ల పంచాయతీ సాగుతోంది. బీయారెస్ అయితే మొత్తం 119 సీట్లకు గానూ 115 సీట్ల దాకా ప్రకటించేసింది. ఇందులో రెడ్లకే 40 సీట్లను కేటాయించడం విశేషం. కమ్మలకు అయిదు ఇచ్చారు బీయారెస్ పెద్దలు, వెలమ సామాజికవర్గానికి 11, బీసీలకు 33 దాకా ఇచ్చారు.
కాంగ్రెస్ సైతం సామాజికవర్గాల వారీగా అన్నీ చూసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కమ్మలకు ఎనిమిది సీట్లు అంటూ ఒక డెలిగేషన్ ఢిల్లీకి వెళ్లడం చూస్తూంటే కాంగ్రెస్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.
ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ లోని సెటిలర్స్ ఎక్కువగా ఉన్న చోట మరి కొన్ని సీట్లు కోరాలని కమ్మ సామాజికవర్గం నేతలు భావిస్తున్నారుట. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తో తెలంగాణాలోని ఆంధ్రా సెటిలర్స్ ఎక్కువగా ఆందోళన చెందారు, నిరసనలు తెలిపారు. ఈసారి వారి ఓట్లు కాంగ్రెస్ వైపు ఎక్కువగా పడతాయని అంతా భావిస్తున్న నేపధ్యం ఉంది.
ఈ క్రమంలో కమ్మల నుంచి అభ్యర్ధులను ఎక్కువ మందిని నిలబెడితే మంచి ఫలితాలు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. వారికి తగిన ప్రయారిటీ ఇవ్వాలన్న డిమాండ్ అలా ఊపందుకుంది. దాంతో ఏపీ పరిస్థితులను సానుకూలం చేసుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు ఈ డిమాండ్లను నెరవేరుస్తారా అన్న చర్చ కూడా సాగుతోంద్.
ఇక రేణుకా చౌదరి నాయకత్వంలోని ఈ ప్రతినిధులు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ని కూడా కలసి విన్నపాలు చేస్తారని అంటున్నారు. కమ్మ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్న చోట తమకే సీట్లు ఇవ్వాలని వారు కోరుతున్న పరిస్థితులలో హై కమాండ్ నిర్ణయం మీద అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.