Begin typing your search above and press return to search.

ఏపీకి కొత్త డీజీపీ... సీనియారిటీ జాబితాలో అగ్రస్థానం!

ఈ క్రమంలో... మే 6న డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌ కుమార్‌ గుప్తా దాదాపు నెలన్నర పాటు ఆ పోస్టులో కొనసాగారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 4:49 AM GMT
ఏపీకి కొత్త డీజీపీ... సీనియారిటీ జాబితాలో  అగ్రస్థానం!
X

సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై విపక్షాల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన అనంతరం.. హరీష్‌ కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... మే 6న డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌ కుమార్‌ గుప్తా దాదాపు నెలన్నర పాటు ఆ పోస్టులో కొనసాగారు. ఈ నేపథ్యంలో తాజాగా నూతన డీజీపీని నియమితులయ్యారు.

అవును... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను కో-ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి.. పోలీసు దళాల అధిపతిగా రాష్ట్రప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

డీజీపీగా ద్వారకా తిరుమలరావు ఎంపికలో సీనియారిటీకే చంద్రబాబు పెద్ద పీట వేశారని అంటున్నారు. ఇందులో భాగంగా... 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల సీనియారిటీ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఏపీ నూతన డీజీపీగా నియమించారని అంటున్నారు.

ద్వారకా తిరుమల రావు మొట్టమొదటి పోస్టింగ్‌ కర్నూలు ఏఎస్పీగా చేపట్టారు. తర్వాత కామారెడ్డి, ధర్మవరంలోనూ ఏఎస్పీగా పనిచేసి.. అనంతరం నిజామాబాద్‌ జిల్లా ఆపరేషన్స్‌ విభాగం అడిషనల్ ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎస్పీగా ప్రమోషన్ పొందిన తర్వాత... కడప, అనంతపురం, మెదక్‌ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సీఐడీ, సీబీఐ విభాగాల్లో ఎస్పీగానూ పనిచేశారు.

ఆక్టోపస్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగాల్లో ఇనిస్పెక్టర్ జనరల్ (ఐజీ) గానూ పనిచేశారు. ఈ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ గా బాధ్యతలు నిర్వర్తించారు.

కాగా... ఇటీవల చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా ట్రాఫిక్ ను సరిగ్గా నియంత్రించకపోవడంతో... గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వాహనం ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధానికి స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లలేకపోయారు. దీంతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీరుపై గవర్నర్ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.