Begin typing your search above and press return to search.

2 పోస్టుల‌కు 212 మంది.. పావుగంట‌లో కొత్త ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌ల ఎంపిక‌.. ఏం జ‌రిగింది?!

భారత ఎన్నికల సంఘం(సీఈసీ) ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలకు మాజీ ఐఏఎస్‌లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్‌లను ఎంపిక చేశారు.

By:  Tupaki Desk   |   14 March 2024 9:47 AM GMT
2 పోస్టుల‌కు 212 మంది.. పావుగంట‌లో కొత్త ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌ల ఎంపిక‌.. ఏం జ‌రిగింది?!
X

భారత ఎన్నికల సంఘం(సీఈసీ) ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలకు మాజీ ఐఏఎస్‌లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్‌లను ఎంపిక చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇరువురిని ఎంపిక చేసింది. ఇక‌, వీరికి రాష్ట్ర‌ప‌తి ఆమోదం ల‌భిస్తే.. వారు బాధ్య‌త‌లు చేప‌డ‌తారు. కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు ఒక‌రు రిటైర్ కావ‌డం. ఇటీవ‌ల మ‌రొక‌రు రాజీనామా చేయ‌డంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.

ఇదిలావుంటే.. తాజా ఎంపిక విధానంపైనా అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల సంఘం స్వ‌తంత్రం గా ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని, ప్ర‌తిప‌క్ష నేత‌, కేంద్ర హోం మంత్రి సార‌థ్యంలోని క‌మిటీ(ఇంత‌కు ముందు సుప్రీకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఉండేవారు. అయితే.. ఆయ‌న‌ను మోడీ స‌ర్కారు త‌ప్పించింది) ఈ ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే చేశారు. అయితే.. ఇది ఏక‌ప‌క్షంగా జ‌రిగిపోయింది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఎన్నిక‌ల సంఘం క‌మిష‌నర్లు ఇద్ద‌రిని ఎంపిక చేసేందుకు మొత్తం 212 మంది అధికారుల‌(రిటైర్డ్‌, ప్ర‌స్తుతం ఐఏఎస్‌లుగా, కార్య‌ద‌ర్శులుగా ఉన్న‌వారు)తో కేంద్రం ఒక జాబితాను రూపొందించింది. వీరి ప్రొఫైళ్లు, ప‌నితీరు, అనుభ‌వం.. సాధించిన రికార్డుల‌తో మొత్తంగా ఒక్కొక్క‌రికీ రెండేసి పేజీల చొప్పున వివ‌రించినా.. మొత్తం 500 పేజీల నివేదిక సిద్ధ‌మైంది. దీనిని అధ్య‌య‌నం చేసేందుకు ఎంత వేగంగా వేసుకున్నా.. పేజీకి 5 నిమిషాల చొప్పున ప‌రిశీల‌న చేసినా.. 2500 నిమిషాలు ప‌డుతుంది. అంటే.. క‌నీసం 45 గంట‌లు.. అంటే రెండు రోజులు పడుతుంది.

కానీ, క‌మిటీలో ఉన్న విప‌క్ష నాయ‌కుడు అధిరంజ‌న్ చౌద‌రికి(కాంగ్రెస్‌) మాత్రం బుధ‌వారం రాత్రి ఈనివేదిక‌ను పంపించారు. (రూల్స్ ప్ర‌కారం). తెల్ల‌వారి 8 గంట‌ల‌కు మీటింగ్ అని చెప్పారు. దీంతో ఆయ‌న హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. క‌నీసం నివేదిక‌లో ఎవ‌రి పేర్లు ఉన్నాయో కూడా చూసుకునే అవ‌కాశం లేదు. ఇంత‌లోనే ఇద్ద‌రి పేర్ల‌ను ప్ర‌ధాని ప్ర‌తిపాదించారు. క‌మిటీలో మెజారిటీ స‌భ్యులు ఓకే అంటే చాలు. వారు ఎంపిక అయిన‌ట్టే ఇదే జ‌రిగింది. అమిత్ షా ఓకే అన్నారు. దీంతో అధిర్‌.. చేతులు క‌ట్టుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇదీ.. జ‌రిగింది. ఇక‌, రాష్ట్ర‌ప‌తి ఆమోద‌మే మిగిలి ఉంది.

ఇదే విష‌యాన్ని చౌద‌రి కూడా చెప్పారు..

"బుధ‌వారం రాత్రి నా పరిశీలన కోసం 212 పేర్లను ఇచ్చారు. బుధ‌వారం రాత్రి ఢిల్లీ చేరుకుంటే, ఈ రోజు మధ్యాహ్నం మీటింగ్ జరిగింది. ఎవరైనా ఒకే రోజులో ఇంత మంది పేర్లను ఎలా పరిశీలిస్తారు..? సమావేశానికి ముందు నాకు 6 పేర్లను షార్ట్ లిస్టును అందించారు. మెజారిటీ వారి వద్ద ఉంది, కాబట్టి వారికి కావాల్సిన అభ్యర్థులను కమిషనర్లుగా నియమించుకున్నారు" అని అధిర్ రంజన్ చౌదరి చెప్పారు.