‘‘తరం మారుతోంది..’’ ఆ 3 రాష్ట్రాల్లో సీఎంలుగా కొత్త ముఖాలు?
ఉత్తరాది పార్టీ.. బీజేపీపై రెండు దశాబ్దాల కిందటి వరకు ఉన్న బలమైన ముద్ర ఇది. అలాంటి పార్టీ కర్ణాటకలోనూ గెలిచి ముద్రను చెరిపేసుకుంది.
By: Tupaki Desk | 6 Dec 2023 12:30 PM GMTఉత్తరాది పార్టీ.. బీజేపీపై రెండు దశాబ్దాల కిందటి వరకు ఉన్న బలమైన ముద్ర ఇది. అలాంటి పార్టీ కర్ణాటకలోనూ గెలిచి ముద్రను చెరిపేసుకుంది. తెలంగాణలోనూ ఉనికి చాటుకుంటోంది.. ఏపీ, తమిళనాడు, కేరళలో మాత్రం ముందుకెళ్లలేకపోతోంది. ఏపీలో రెండుసార్లు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం, అక్కడినుంచి గెలిచిన ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం తప్ప ఇంకా పైకి ఎదిగే చొరవ కొరవడింది. ఇప్పుడిక తాజా ఎన్నికల్లోనూ ఉత్తరాదిన ఉన్న మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుని రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
మరి అక్కడ సారథులు ఎవరు..?
రాజస్థాన్, మధ్యప్రదేశ్.. దేశంలో విస్తీర్ణం రీత్యా పెద్ద రాష్ట్రాలు. 200 అంతకుమించి ఎమ్మెల్యే సీట్లున్న రాష్ట్రాలు. ఛత్తీసగఢ్ చిన్న రాష్ట్రమే అయినా.. దానిన ఏర్పాటు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాలు ఆ పార్టీకి కీలకం. ఇటీవల ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ ఓడుతుందని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కానీ, వాటిని అద్బుత మెజారిటీతో చేజిక్కించుకుంది. నాయకత్వం పరంగా చూస్తే.. మధ్యప్రదేశ్ లో బీజేపీకి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. నాలుగుసార్లు సీఎంగా పనిచేశారు. మరోవైపు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. రాజ కుటుంబానికి చెందిన సింధియాకు రాష్ట్ర రాజకీయాల్లో గట్టి పట్టుంది. ఛత్తీస్ గడ్ లో బీజేపీ తరఫున మాజీ సీఎం రమణ్ సింగ్, రాజస్థాన్ లో జ్యోతిరాదిత్య మేనత్త, మాజీ సీఎం వసుంధరా రాజే ఉన్నారు. అయితే, మూడుచోట్లా బీజేపీ ఈ సారి కొత్త ముఖాలకు సీఎంగా చాన్సివ్వనుందట.
సుదీర్ఘ కసరత్తు..
కొత్త సీఎంల ఎంపికపై మంగళవారం ప్రధాని మోదీ నివాసంలో నాలుగున్నర గంటల పాటు సమావేశం జరిగింది. 2024 ఎన్నికలకు ఉపయోగపడేలా సీఎంల ఎంపిక నిర్ణయం ఉండాలని ఆ సందర్భంగా నిర్ణయించినట్లు తెలిసింది. అందులోభాగంగానే ‘‘తరం మార్పు’’ అనే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను సమీక్షించినట్లు తెలుస్తోంది. ఇక సీఎంల నిర్ధారణకు బీజేపీ పెద్దలు.. రాష్ట్రాలకు ప్రతినిధులను పంపనున్నారు. వీరు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించనున్నారు.
ఎక్కడెక్కడ ఎవరెవరు?
మధ్యప్రదేశ్ లో శివరాజ్ తో పాటు కేంద్ మంత్రలు జ్యోతిరాదిత్య, ప్రహ్లాద్ పటేల్, నరేంద్ర సింగ్ తోమర్, సీనియర్ నాయకుడు కైలాష్ విజయ వర్గీయ సీఎం రేసులో ఉన్నారు. రాజస్థాన్ లో వసుంధరకు తోడుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీపీ జోషీ, ప్రముఖ నాయకులు దియా కుమారి, మహంత్ బాలక్ నాథ్ పేర్లను పరిశీలిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లో రమణ్ సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ సాహూ, ప్రతిపక్ష నేత ధరమ్ లాల్ కౌశిక్, మాజీ ఐఏఎస్ అధికారి ఓపీ చౌధురి లో ఎకరిని సీఎం చేయాలని ఆలోచిస్తున్నారు. దీన్నంతటినీ గమనిస్తున్న విశ్లేషకులు.. బీజేపీ నాయకత్వం ఆశ్చర్యకర ఎంపికలు చేపట్టినా ఆశ్చర్యపోవద్దని సూచిస్తున్నారు.