కొత్త హైకోర్టు భవనం : సీఎం హోదాలో రేవంత్ చేసే ఫస్ట్ శంకుస్థాపన...!
ఈ మేరకు రాజేంద్ర నగర్ లో వంద ఎకరాల్లో హైకోర్టు నూతన భవనాలకు సంబంధించి శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి జనవరి నెలను ముహూర్తంగా నిర్ణయించారు.
By: Tupaki Desk | 14 Dec 2023 5:01 PM GMTతెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో చేస్తే మొదటి శంకుస్థాపన న్యాయాన్ని రక్షించే న్యాయ దేవతకు సంబంధించిన న్యాయాలయం.నూతన భవనం కోసం తెలంగాణా హైకోర్టు భవనం ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నందువల్ల వంద ఎకరాలలో నూతన హైకోర్టు భవనం నిర్మాణం చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రాజేంద్ర నగర్ లో వంద ఎకరాల్లో హైకోర్టు నూతన భవనాలకు సంబంధించి శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి జనవరి నెలను ముహూర్తంగా నిర్ణయించారు.
దాంతో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేసే తొలి భారీ కార్యక్రమం ఇదే అవబోతోంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్న హైకోర్టు భవనాల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి హైకోర్టు న్యాయమూర్తి తీసుకుని వచ్చారు. దానికి వెంటనే రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ఎక్కడ అయితే వందకు పైగా ఎకరాల భూమి ఖాళీగా ఉందో చూడమని అధికారులను కోరారు. అధికారులు రాజేంద్రనగర్ లో ఉందని చెప్పడంతో అక్కడే కొత్త హైకోర్టు భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఇదిలా ఉంటే పాత హైకోర్టు భవనాన్ని కూడా చారిత్రక సంపదకు గుర్తుగా భావించి దాన్ని పునరుద్ధరించి సిటీ కోర్టు కార్యకలాపాలకు వాడుకునేందుకు కూడా సీఎం నిర్ణయించారు. ఇక కొత్త జిల్లా స్థాయిలో కూడా నూతన కోర్టు భవనాలను నిర్మించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రిని కోరారు.
దానికి సైతం సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఏయే జిల్లాలలో ఎక్కడెక్కడ కొత్త కోర్టు భవనాలు అవసరం అవుతాయో చూసి ప్రణాళికలను సిద్ధం చేయాలని కూడా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మొత్తానికి న్యాయదేవతకు కొత్త ఆలయం నిర్మాణానికి చేసే శంకుస్థాపనలో కొత్త ముఖ్యమంత్రి మొదటిగా పాల్గొనవడం శుభారంభం అని అంతా అంటున్నారు. రేవంత్ రెడ్డి సైతం పాలనాపరమైన విషయాలలో
చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా డైనమిక్ లీడర్ గానే తొలి వారం రోజుల పాలనలో రుజువు చేసుకుటున్నారు అని అంటున్నారు.