Begin typing your search above and press return to search.

పెళ్లైన ఒక్క రోజుకే ప్రసవించిన వధువు

సమాజం మారింది.. కట్టుబాట్లు మారాయి. సినిమాల ప్రభావమో.. లేక వ్యసనాలో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో యువత దారితప్పుతున్నారు.

By:  Tupaki Desk   |   4 March 2025 2:00 PM IST
పెళ్లైన ఒక్క రోజుకే ప్రసవించిన వధువు
X

సమాజం మారింది.. కట్టుబాట్లు మారాయి. సినిమాల ప్రభావమో.. లేక వ్యసనాలో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో యువత దారితప్పుతున్నారు. పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్నారు. దానివల్ల ఎన్నో అనార్థాలు వాటిల్లుతున్నాయి. కడుపుతో ఉన్న ఒక అమ్మాయి ఆ విషయం దాచి వేరే వరుడితో పెళ్లిపీటలు ఎక్కింది. చివరకు పెళ్లైన ఒక్కరోజుకే ఆ విషయం బయటపడడంతో ఆ పెళ్లి పెటాకులైన పరిస్థితి నెలకొంది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే వధువు ప్రసవించడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

స్థానిక సమాచారం ప్రకారం, ఇటీవల ఓ యువతిని యువకుడితో వివాహం చేశారు. పెళ్లైన మరుసటి రోజే ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, ఆమె తొమ్మిది నెలల గర్భవతి అని వైద్యులు వెల్లడించారు. ఆమెకు డెలివరీ చేశారు. ఒక బాబుకు ఆమె జన్మనిచ్చింది.

ఈ ఊహించని పరిణామంతో వరుడు అవాక్కయ్యాడు. కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. చివరకు, వరుడు తన భార్యను ఆమె తల్లిదండ్రుల ఇంటికి తిరిగి పంపించేశాడు. ఈ సంఘటనపై గ్రామస్తుల మధ్య పెద్ద చర్చ మొదలైంది.

ఈ ఘటన నెట్టింట్లో వైరల్ అవ్వడంతో, వివాహ సంబంధ వ్యవస్థలో అవగాహన అవసరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పెళ్లికి ముందు పరస్పర నమ్మకాన్ని పెంపొందించుకోవడం, పూర్తి స్థాయిలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.