Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా జేజెమ్మ!

తాజా ఎన్నికల్లో డీకే అరుణ మహబూబ్‌ నగర్‌ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజారిటీతో విజయం సాధించారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 9:37 AM GMT
తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా జేజెమ్మ!
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా మహబూబ్‌ నగర్‌ ఎంపీ డీకే అరుణను నియమించవచ్చని తాజాగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో డీకే అరుణ మహబూబ్‌ నగర్‌ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజారిటీతో విజయం సాధించారు.

పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం.. మహబూబ్‌ నగర్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. దీంతో ముఖ్యమంత్రిని ఎదుర్కొని మరీ తాను విజయం సాధించానని.. తనకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠం ఇవ్వాలని డీకే అరుణ కోరుతున్నట్టు సమాచారం.

ఇప్పటివరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌ రెడ్డి కేంద్ర కేబినెట్‌ మంత్రి అయ్యారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన బండి సంజయ్‌ కూడా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. దీంతో బీజేపీ అధ్యక్ష పదవిని మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్‌ కు ఇస్తారని టాక్‌ నడిచింది. ఇందుకు తగ్గట్టే ఈటల ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే తెలంగాణలో మంచి వాగ్ధాటి ఉన్న నేతగా, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపైన, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపైన ఒంటి కాలితో లేచే నేతగా, ఫైర్‌ బ్రాండ్‌ గా డీకే అరుణకు పేరుంది.

గతంలో మహబూబ్‌ నగర్‌ జిల్లా గద్వాల నుంచి వరుసగా మూడుసార్లు డీకే అరుణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో అరుణను ఆమె అభిమానులు, అనుచరులు జేజమ్మ అని పిలుచుకుంటుంటారు.

పొలిటికల్‌ ఫైర్‌ బ్రాండ్‌ గా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుర్తింపు, చరిష్మాపైనే డీకే అరుణ ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది. గతంలో సమాజ్‌ వాదీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉండటం, మంత్రిగా పనిచేసి ఉండటంతో తనకు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నట్టు తెలుస్తోంది.

డీకే అరుణ 1999లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గద్వాలలో ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్‌ సీటు దక్కకపోవడంతో సమాజవాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ వెంటనే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009, 2014లోనూ గద్వాల నుంచే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్‌ సృష్టించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణ ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీలో చేరారు. ఎకాయెకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తాజా ఎన్నికల్లో మహబూబ్‌ నగర్‌ ఎంపీగా గెలుపొందారు.

మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవిని చాలా మంది ఆశిస్తున్నారు. ఈటల రాజేందర్‌ తోపాటు మెదక్‌ ఎంపీగా గెలిచిన రఘునందన్‌ రావు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కూడా ఆశిస్తున్నారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌ రెడ్డిలను ఓడించి జెయింట్‌ కిల్లర్‌ గా నిలిచిన వెంకట రమణారెడ్డి సైతం తనకు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. మరి బీజేపీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో వేచిచూడాల్సిందే.