Begin typing your search above and press return to search.

కేసీయార్ కోసం వెయిట్ చేస్తున్న కొత్త రికార్డు...!

గ్రాస్ రూట్ లెవెల్ లో టీయారెస్ కి బలం లేదు కాబట్టి కొన్ని సీట్లు దక్కినా అధికారానికి చేరువ కాలేదని కూడా భావించారు.

By:  Tupaki Desk   |   15 Nov 2023 11:30 PM GMT
కేసీయార్ కోసం వెయిట్ చేస్తున్న కొత్త రికార్డు...!
X

బీయారెస్ అధినేత కేసీయార్ అంటేనే అనితర సాధ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. రాదు అనుకున్న తెలంగాణాను తెచ్చిన ఘనత ఆయన ఖాతాలోకే వెళ్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా కూడా కేసీయార్ తెలంగాణా నినాదాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఉద్యమాన్ని యమ జోరుగా నడిపారు. రాజకీయ అనివార్యతను సృష్టించారు.

అలాగే అన్ని పార్టీలకూ ఒక టెన్షన్ పుట్టించారు. తెలంగాణా నినాదం వద్దు అన్న వారి చేతనే జెండా పట్టించారు. పొత్తులు పెట్టుకునేలా చేశారు. అలా కేసీయార్ తెలంగాణాను సాధించారు. ఇక తెలంగాణా వచ్చాక చూస్తే తెలంగాణాలో రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ అయితే రెండవది టీడీపీ.

ఆ రెండు పార్టీలలో ఒక దానికి అధికారం 2014లో దక్కుతుందని అంతా భావించారు. గ్రాస్ రూట్ లెవెల్ లో టీయారెస్ కి బలం లేదు కాబట్టి కొన్ని సీట్లు దక్కినా అధికారానికి చేరువ కాలేదని కూడా భావించారు.

అయితే అనూహ్యంగా పుంజుకుని టీయారెస్ మొదటిసారి తెలంగాణాలో అధికారంలోకి వచ్చింది. ఇక రెండవ దఫా నాటికి టీడీపీని పూర్తిగా కోలుకోకుండా చేశారు. కాంగ్రెస్ ని టార్గెట్ చేశారు. ఇపుడు మూడవసారి ఎన్నికల సంగ్రామం జరుగుతోంది. ఈసారి కూడా కేసీయార్ గెలుస్తారు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

అయితే టఫ్ ఫైట్ నడుస్తోంది పైగా కాంగ్రెస్ కి మంచి ఊపు ఉంది కాబట్టి ఆ పార్టీ విజయం తధ్యమని అంటున్న వారూ ఉన్నారు. అయితే రికార్డులు రాజకీయంగా సృష్టించడంతో తనకు ఎదురులేదు అని పలుమార్లు చాటుకున్న కేసీయార్ ముందు ఇపుడు ఒక అరుదైన రికార్డు నిలిచి ఉంది.

అదే వరసగా మూడు సార్లు ఏ ముఖ్యమంత్రీ అధికారం చేపట్టలేదు. ఎన్టీయార్ అయినా ఎమ్జీయార్ అయినా జయలలిత అయినా వైఎస్సార్ అయినా వరసాగా రెండు సార్లు గెలిచారు. ఎంతో ప్రజాకర్షణ కలిగిన నేతలు అంతా కూడా మూడు అన్న మాటను హ్యాట్రిక్ గెలుపు పిలుపుని వినలేదు.

అందుకే ఆ రికార్డు సౌతిండియాలోనే అలా పదిలంగా ఉంది. ఇపుడు ఆ రికార్డుని బద్ధలు కొట్టడానికి కేసీయార్ రెడీగా ఉన్నారని బీయారెస్ నేతలు అంటున్నారు. ఈసారి కేసీయార్ కనుక గెలిస్తే దక్షిణాదిన ఉన్న నాలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సాధించిన అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంటారు అని అంటున్నారు.

ఈ దెబ్బతో కేసీయార్ సౌతిండియా పొలిటికల్ కింగ్ అవతారం ఎత్తడం ఖాయమని అంటున్నారు. అదే విధంగా జాతీయ రాజకీయాల్లో కూడా కేసీయార్ తన బీయారెస్ పార్టీతో దూసుకెళ్ళే చాన్స్ ఉంది అని అంటున్నారు. అందుకోసం 2023 లో జరుగుతున్న ఈ ఎన్నికలు బీయారెస్ కి అత్యంత కీలకంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలను గెలవాలని కూడా కేసీయార్ పట్టుదల మీద ఉన్నారు

దీని మీద హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన బీయారెస్ మంత్రి హరీష్ రావు కేసీయార్ ఈసారి గెలిచి తీరుతారు అని అన్నారు. ఇప్పటిదాకా దక్షిణాదిలో లేని రికార్డుని ఆయన సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అన్ని మంచి పనులు చేసిన తాము గెలవకపోతే ఎవరు గెలుస్తారు అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు మంచి పాలనను ఎపుడూ వదులుకోరని కూడా హరీష్ అంటున్నారు.

మొత్తం మీద కేసీయార్ హ్యాట్రిక్ సీఎం ఆఫ్ సౌతిండియాగా మారుతారా లేదా అన్నది డిసెంబర్ 3న తేలనుంది. కేసీయార్ పవర్ ఆయన బలం వ్యూహం అన్నీ కూడా ఈసారి ఎన్నికల్లో పూర్తిగా బయటకు వస్తాయని అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.