ఇకపై బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు... ఏమిటీ బిల్లు?
ఈ సందర్భంగా పలు కీలక విషయాలు అందులో పొందుపరిచారు.
By: Tupaki Desk | 9 Aug 2024 9:57 AM GMTతాజాగా నేడు లోక్ సభలో కేంద్రం... ప్రభుత్వ బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు - 2024ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఖాతాల నామినీలు, డైరెక్టర్ షిప్ హోదా కోసం కనీస వాటాలకు సంబంధించిన అంశాలను అందులో పొందుపరించింది. ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు.
అవును... శుక్రవారం లోక్ సభలో ప్రభుత్వ బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు - 2024ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు అందులో పొందుపరిచారు. ఇందులో భాగంగా... బ్యాంక్ ఖాతాల నామినీల సంఖ్యను నలుగురి వరకూ పెంచేలా మార్పులు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అయితే... ప్రస్తుతానికి బ్యాంక్ అకౌంట్ కు ఒక్క నామినీని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... డైరెక్టర్ షిప్ హోదా కోసం ఉండాల్సిన కనీస వాటా పరిమితిని సైతం పెంచేలా ఈ బిల్లులో సవరణ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల మొత్తాన్ని రూ.2 కోట్లకు పెంచనున్నారని అంటున్నారు.
ఇదే క్రమంలో... సహకార బ్యాంకులకు సంబంధించి కూడా బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లులో కీలక మార్పులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆడిటర్లకు చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించుకునే స్వాతంత్రయాన్ని పూర్తిగా ఈ బ్యాంకులకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బ్యాంకుల రిపోర్టింగ్ తేదీలలోనూ మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ మేరకు ఆ రిపోర్టింగ్ తేదీలను రెండు, నాలుగో శుక్రవారాల నుంచి.. ప్రతి నెలా 15, నెలాఖరు (చివరి తేదీ) లకు మారుస్తూ సవరణ చేసినట్లు చెబుతున్నారు.