Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... అసెంబ్లీలో టీడీపీ నేతలకు కొత్త కండిషన్!

ఈ నేపథ్యంలో.. టీడీపీ ఆసక్తికర నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2024 5:47 AM GMT
హాట్  టాపిక్... అసెంబ్లీలో  టీడీపీ నేతలకు కొత్త కండిషన్!
X

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలిరోజు గవర్నర్ ప్రసంగం జరుగుతుంది. ఇక ఈ సెషన్స్ లోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. టీడీపీ ఆసక్తికర నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలకు సూచనలు కూడా పంపారని సమాచారం.

అవును... నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేతలు కొన్ని కీలక సూచనలు చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా... ప్రధానంగా డ్రెస్ కోడ్ పై సూచనలు చేశారని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పసుపు రంగు దుస్తుల్లోనే అసెంబ్లీకి రావాలని పేర్కొన్నారట. ఇదే క్రమంలో.. సైకిల్ గుర్తు ఉన్న పసుపు కండువాలు మాత్రమే మెడలో ధరించాలని సూచించారని అంటున్నారు. ఈ డ్రెస్ కోడ్ సూచనలు తప్పకుండా పాటించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.

మరోపక్క... మెడలో సైకిల్ గుర్తు ఉన్న పసుపు కండువా ధరించాలని చెప్పడంతో పాటు.. ఆ కండువాపై ఎన్టీఆర్ కానీ, చంద్రబాబు కానీ ఫోటోలు ఉండకూడని కూడా కండిషన్ పెట్టుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో.. గతంలో ఎప్పుడూ లేనిది ఇలా ఎందుకు అనే చర్చా తెరపైకి వచ్చింది!

అయితే... ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి చెందిన ఎమ్మెల్యేలు 164మంది ఉన్నారు. వీరిలో 135 మంది టీడీపీ సభ్యులే ఉన్నారు. ఇక మిగిలిన వారిలో 21మంది జనసేన, 8మంది బీజేపీకి చెందిన సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో... టీడీపీ సభ్యులు 135మందీ ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఫాలో అవ్వడంవల్ల సభలో తమ సంఖ్యను ప్రతిబింబించాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఆలోచన చేసి ఉంటారని అంటున్నారు.

ఇక, అటు జనసేన నుంచి ఇప్పటివరకూ అలాంటి ఉత్తర్వులు రాలేదని అంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతలకు కూడా అలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. కాకపోతే వారు కాషాయ కండువాలతో వస్తుంటారనేది తెలిసిన విషయమే! ఏది ఏమైనా... టీడీపీ చెప్పినట్లు చెబుతున్న ఈ డ్రెస్ కోడ్ అంశం ఆసక్తిగా మారింది.