చిల్లరకష్టాలకు చెక్ చెప్పేసిన జొమాటో
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్.
By: Tupaki Desk | 8 Aug 2024 5:10 AM GMTఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లలో పేరున్న జొమాటాలో ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారంతా తరచూ ఒక సమస్యను ఎదుర్కోవటం తెలిసిందే. చిల్లర కష్టాలతో ఏదో ఒక ఇబ్బంది ఖాయం. తాజాగా ఆ కష్టాలకు చెక్ చెప్పేస్తూ.. తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్.
ఇప్పటివరకు ఉన్న విధానంలో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసి.. పేమెంట్ ను క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిని ఎంచుకున్నప్పుడు.. డెలివరీ తర్వాత డబ్బులు చెల్లించే వేళలో చిల్లర సమస్యల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. ఫుడ్ ఆర్డర్ చేసే వారి దగ్గర కానీ.. డెలివరీకి వచ్చిన వారి వద్ద కానీ సరిపడా చిల్లర లేకపోవటంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఇబ్బందులపై చికాకులు ఏర్పడుతున్న పరిస్థితి.
దీనికి తాజాగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది జొమాటో. క్యాష్ ఆన్ డెలివరీ వేళ.. చిల్లర సమస్య ఎదురైతే.. వారు రౌండ్ ఫిగర్ ఇచ్చేయొచ్చు. అదనంగా ఇచ్చిన మొత్తాన్ని అప్పటికప్పుడు డెలివరీ బాయ్.. సదరు కస్టమర్ ఖాతాలో డిజిటల్ రూపంలో జమ చేస్తారు. తర్వాతి బుకింగ్ వేళలో అదనంగా చెల్లించిన మొత్తాన్నిమినహాయించుకొని చెల్లింపులు జరిపేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లుగా జొమాటో సీఈవో పేర్కొన్నారు.
ఇన్ స్టంట్ క్రెడిట్ సుదుపాయాన్ని పొందటంలో తాము టాటా గ్రూప్ కు చెందిన ‘బిగ్ బాస్కెట్’ నుంచి స్ఫూర్తి పొందినట్లుగా పేర్కొన్నారు. ఇందుకు టాటాలకు థ్యాంక్స్ చెప్పారు. జొమాటో తీసుకొచ్చిన ఈ కొత్త పద్దతిపై నెటిజన్లు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు.. ఇతరుల నుంచి కొత్త విషయాల్ని నేర్చుకోవటం.. వాటిని బహిరంగంగా అంగీకరించటం బాగుందంటూ.. బిగ్ బాస్కెట్ కు థ్యాంక్స్ చెప్పిన వైనం పలువురిని ఆకట్టుకుంటోంది.