వైసీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!
అవును... వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ ప్రక్షాళనలో భాగంగా జగన్ పలు నియోజకవర్గాలతో పాటు జిల్లాల అధ్యక్షులను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 15 July 2024 1:45 PM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైసీపీలో తీవ్ర అంతర్మథనం జరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో పలు విభాగాల్లో ప్రక్షాళన కార్యక్రమాలు షురూ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా.. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుని నియామకం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది!
అవును... వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ ప్రక్షాళనలో భాగంగా జగన్ పలు నియోజకవర్గాలతో పాటు జిల్లాల అధ్యక్షులను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరు ప్రకాశం జిల్లాకు అధ్యక్షుడిగా తెరపైకి వచ్చింది.
దీంతో... ఈ ప్రతిపాదన జిల్లా వైసీపీలో కలకలంగా మారింది. దీని పైన మాజీ మంత్రి బాలినేని స్పందించారు. ఇందులో భాగంగా... ప్రకాశం జిల్లాలో నాయకులకు కొదవలేదని వ్యాఖ్యానించారు. పార్టీలో నేతలకు జిల్లా గొడ్డుపోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో... పార్టీ అధ్యక్ష పదవి జిల్లాకు చెందిన వ్యక్తులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక... 1999 నుంచి రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేసిన బాలినేని... 2024 ఎన్నికలే తన చివరి ఎన్నికలని తేల్చి చెప్పారు. తాను ఏం తప్పు చేశానో తెలియదని, ప్రజలు ఇతరులకు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత మనస్థాపంతో హైదరాబాద్ వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు.
వైసీపీ కార్యకర్తలను కొట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని.. దమ్ము, ధైర్యం ఉంటే తనను ఎదుర్కోవాలని సవాల్ చేసారు. ఇదే సమయంలో తాను జనసేనలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెబుతూ.. అసలు తానెందుకు జనసేనలోకి వెళ్లాలని ఎదురు ప్రశ్నించారు.
ఇక తాను మంత్రిగా ఉండగా హవాలా మంత్రి అని ప్రచారం చేశారని చెప్పిన బాలినేని శ్రీనివాస్... దమ్ముంటే నిరుపించాలని సవాల్ చేశారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఇక్కడే ఉరేసుకుని చస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అవినీతికి పాల్పడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు స్వయంగా విచారణ జరిపించవచ్చని తెలిపారు.
కాగా... చెవిరెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారనేది తెలిసిన సంగతే! అయితే... చివరకు అధిష్టానం బుజ్జగించడంతో ఆయన నాడు వెనక్కి తగ్గారు. అయితే... ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని అన్నట్లు తెలుస్తోంది.