తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త గలాటా!
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ప్రభుత్వ ప్రకటనల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటో మిస్ కావడం కొత్త చర్చకు తావిచ్చింది.
By: Tupaki Desk | 6 March 2024 5:37 AM GMTతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో ఉంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, రూ.500కే మూడు గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తోంది.
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ప్రభుత్వ ప్రకటనల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటో మిస్ కావడం కొత్త చర్చకు తావిచ్చింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనల్లో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో మాత్రమే కనిపిస్తోందని చెబుతున్నారు. భట్టి విక్రమార్క ఫొటో లేకపోవడం కాంగ్రెస్ లో కొత్త పంచాయతీకి దారి తీయొచ్చని అంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒంటి చేత్తో రేవంత్ రెడ్డి విజయాన్ని కట్టబెట్టారు. అలాగే భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర కూడా కాంగ్రెస్ కు కొంతవరకు ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డితోపాటు భట్టి విక్రమార్క కూడా గట్టిగానే పోటీ పడ్డారు. అందులోనూ భట్టి విక్రమార్క దళిత సామాజికవర్గానికి చెందినవారు. తెలంగాణలో దాదాపు 20 శాతం భట్టి సామాజికవర్గం ఉంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అనేక తర్జనభర్జనల అనంతరం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. డిప్యూటీ సీఎం పదవిని ఒకే ఒక్కరికి.. అది కూడా భట్టి విక్రమార్క గౌరవాన్ని తగ్గించకుండా ఆయనకే పరిమితం చేసింది. ఈ వ్యవహారంలో సేమ్ కర్ణాటకలో పద్ధతినే అనుసరించింది. కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం పదవికి పోటీ పడ్డారు. దీంతో ముఖ్యమంత్రి పదవిని సిద్దరామయ్యకు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది.
ఈ మేరకు తెలంగాణలో రాజీ చేసిన కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా రేవంత్, భట్టి విక్రమార్కలకు బాధ్యతలు ఇచ్చినప్పుడే కొన్ని సూచనలు చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫొటోతో పాటు డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క ఫొటోను కూడా వేయాలని సూచించింది. దీంతో పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇస్తున్న ప్రభుత్వ ప్రకటనల్లో సీఎం రేవంత్ తోపాటు భట్టి విక్రమార్క చిత్రాలను కూడా ముద్రిస్తున్నారు.
అయితే తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనల్లో కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఫొటో మాత్రమే ఉంది. భట్టి విక్రమార్క ఫొటో లేదు. తాజాగా ప్రజాపాలనలో కొలువుల పండుగ పేరుతో ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మూడు నెలల్లో 5192 ఉపాధ్యాయులు, ౖవైద్యులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది, కానిస్టేబుళ్ళ ఉద్యోగాలిచ్చినట్లు ఉంది.
ఈ 5192 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించింది. దీనికోసం ప్రభుత్వం మీడియాకు ప్రకటనలు ఇచ్చింది. అయితే అందులో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో మాత్రమే వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటో లేకపోవడం కొత్త చర్చకు దారితీసింది. సాధారణంగా సమాచార, ప్రజా సంబంధాల శాఖ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేస్తుంది. మరి ఇది పొరపాటున జరిగిందా, లేక మరేదైనా కారణమా అనేది తేలాల్సి ఉంది.