Begin typing your search above and press return to search.

గుంతల రోడ్ కు చెక్ చెప్పే సరికొత్త టెక్నాలజీ.. ఎలా పని చేస్తుందంటే?

కనీసం.. గుంతల రోడ్లు లేకుండా ఉంటే బాగుండని అందరూ కోరుకుంటూ ఉంటారు.

By:  Tupaki Desk   |   7 May 2024 10:30 AM GMT
గుంతల రోడ్ కు చెక్ చెప్పే సరికొత్త టెక్నాలజీ.. ఎలా పని చేస్తుందంటే?
X

గుంతల రోడ్ తో వచ్చే కష్టాలు.. జరిగే నష్టాలు.. చోటు చేసుకునే ప్రమాదాలు.. పోయే ప్రాణాల గురించి తెలుగు రాష్ట్రాల వారికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఏళ్లకు ఏళ్లుగా గుంతల రోడ్ల మీద ప్రయాణించే అలవాటు ఉన్న తెలుగు వారు.. తాము ఎన్నుకున్న ప్రభుత్వం తమ బతుకుల్ని పూర్తిగా మార్చకపోయినా ఫర్లేదు. కనీసం.. గుంతల రోడ్లు లేకుండా ఉంటే బాగుండని అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ.. ఆ కల మాత్రం నిజం కాని పరిస్థితి.

గుంతల రోడ్ల కారణంగా రోజువారీగా చోటు చేసుకునే చిన్న ప్రమాదాలకు లెక్క లేదు. అంతేకాదు.. గుంతల రోడ్ కారణంగా ప్రయాణ వేగం కూడా తగ్గిపోవటం తెలిసిందే. తరచూ ట్రాఫిక్ జాంతో పాటు.. ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ గుంతల్ని పూడ్చే కార్యక్రమం శ్రమతో కూడుకున్నది కావటంతో.. తరచూ ప్రభుత్వాలు గుంతల్ని పూడ్చలేక కిందా మీదా పడుతున్నారు.

ఇలాంటి వేళ.. గుంతలు లేని రోడ్ల కోసం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తేవాలని నేషనల్ హైవే అధారిటీ ఆలోచిస్తోంది. సాధారణంగా రోడ్ల మీద గుంత ఏర్పడినప్పుడు దానంతట అదే పూడుకుపోయే సాంకేతికత మీద కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్ల నిర్మాణం కోసం తారు.. కంకర రాళ్లు.. బైండర్.. ఫిల్లర్ తో కూడి అస్ఫాల్ట్ కాంబినేషన్ ను వాడుతున్నారు. అయితే.. రోడ్డు వేసిన కొంతకాలానికి తారు క్షీణతకు గురి కావటంతో .. గుంతలు పడే పరిస్థితి.

ఈ నేపథ్యంలో గుంతలు వాటంతట అవే పూడుకునేలా రోడ్ల నిర్మాణంలో సెల్ప్ హీలింగ్ మెటీరియల్ వాడేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో స్టీల్ ఫైబర్స్.. తారు ఉంటాయని చెబుతున్నారు. గుంత ఏర్పడినంతనే తారు వేడెక్కి దానంతట అదే పూడుకుపోతుందని చెబతున్నారు. ఈ కొత్త టెక్నాలజీని కొన్ని నేషనల్ హైవేల మీద పరీక్షిస్తుననారు. వీటి వల్ల కలిగే ప్రయోజనం.. అయ్యే ఖర్చుల లెక్కల్ని వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో గుంతలు పడిన రోడ్డును తనకు తానే హీలింగ్ చేసే టెక్నాలజీ త్వరగా అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం.