కేరళలో కొత్త ట్రాఫిక్ రూల్.. చదివితే చెమటలు పట్టాల్సిందే
పెరిగే వాహనాలకు తగ్గట్లే.. ట్రాఫిక్ భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 July 2024 5:30 AM GMTపెరిగే వాహనాలకు తగ్గట్లే.. ట్రాఫిక్ భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడుగా ప్రమాదాలు అంతే ఎక్కువగా పెరుగుతున్న దుస్థితి. ఇలాంటి వేళ.. రోడ్డు ప్రమాదాలకు బ్రేకులు వేసేందుకు వీలుగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్ గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. టూవీలర్ వాహనదారుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపే ఈ నిబంధన.. డ్రైవర్లకు చెమటలు పట్టేలా చేస్తుందని చెప్పాలి.
బైక్ వెనుక కూర్చున్న రైడర్ తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే డ్రైవర్ల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే వీలుగా కేరళ ప్రభుత్వం కొత్త రూల్ ను తీసుకొచ్చింది. దీని ప్రకారం టూవీలర్ డ్రైవింగ్ చేసే వేళలో వెనుక కూర్చున్న రైడర్ తో మాట్లాడినా నేరమే. దీన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నారు. ఈ రూల్ అన్ని టూవీలర్లకు వర్తిస్తుందని తేల్చారు. ఒకవేళ.. ఈ రూల్ ను బ్రేక్ చేసిన వారికి ఫైన్ విధించే వీలు కల్పిస్తున్నారు. ఒకవేళ.. ఈ తప్పును పదే పదే చేస్తూ.. ఫైన్లు కడుతున్న వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని వెల్లడించారు.
కొత్త రూల్ ను పక్కాగా అమలు చేయాలని.. వాహనదారులకు అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వెనుక వ్యక్తితో మాట్లాడుతున్న రైడర్ కు చలానాలు పంపుతామని పేర్కొన్నా.. ఆ మొత్తం ఎంతన్న విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు వెనుక కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతున్న వేళలో డ్రైవింగ్ చేస్తే.. పరధాన్యంలో ప్రమాదం బారిన పడే వీలుంది.
ఈ కారణంతోనే ప్రభుత్వం కొత్త రూల్ ను తీసుకొచ్చినట్లు అధికారులు వివరిస్తున్నారు. రహదారి భద్రతను పెంపొందించటమే లక్ష్యంగా ఈ కొత్త రూల్ ను ప్రవేశ పెట్టారు. ఈ కొత్త రూల్ పై మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు మంచి నిబంధన అంటే.. మరికొందరు మాత్రం ప్రాక్టికల్ గా అంత ఈజీ కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కేరళ సర్కారు తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన హాట్ టాపిక్ గా మారింది.