Begin typing your search above and press return to search.

కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. బొడ్డు కోసి పేరెట్టిన అమెరికా!

గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Aug 2023 5:41 AM GMT
కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. బొడ్డు కోసి పేరెట్టిన అమెరికా!
X

గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉందని అంటున్నారు. భారత్ లో రోజూవారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఫలితంగా ప్రజలు సాధారణ జీవితాన్నే కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో కరోనా కొత్త వేరియంట్లు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.

అవును... "కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్స్" అంటూ గతకొన్ని రోజులుగా వినిపిస్తోన్న మాటలు టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే ఈజీ.5 అనే వేరియంట్ అమెరికా, బ్రిటన్‌తో పాటు పలు దేశాల్లో వెలుగు చూసిన నేపథ్యంలో... తాజాగా అమెరికాలో మరో కొత్త వేరియంట్‌ ను అధికారులు గుర్తించారు.

ఈ కొత్త వేరియంట్ అమెరికాతో సహా ఇజ్రాయెల్, డెన్మార్క్ దేశాల్లో కూడా బయటపడినట్లు అమెరికాకు చెందినటువంటి వ్యాధి నియంత్రణ కేంద్రం వెల్లడించింది. కొవిడ్ 19 కి చెందిన అత్యంత పరివర్తన చెందినటువంటి కొత్త వేరియంట్‌ ను గుర్తించినట్లు తెలిపింది. ఈ వేరియంట్‌ కు బీఏ.2.86 గా నామకరణం చేసినట్లు పేర్కొంది.

ఇదే సమయంలో ఈ కొత్త వేరియంట్‌ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) కూడా స్పందించింది. బీఏ.2.86లో అధిక సంఖ్యలో ఉత్పరివర్తనలు కలిగి ఉన్నందువల్ల దానిని "పర్యవేక్షణలో ఉన్నటువంటి వేరియంట్‌"గా పేర్కొన్నట్లు తెలిపింది. ఈ రకానికి చెందినటువంటి సీక్వెన్స్‌ లు కొన్ని దేశాల్లో కూడా వెలుగు చూసినట్లు తెలిపింది.

మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం.. కొవిడ్ -19 కి కారణమయ్యేటటువంటి వైరస్ తో పాటు అన్ని వైరస్‌ లు కాలక్రమేనా రూపాంతరం చెందుతూ.. తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఈ వైరస్ ఎంతవేగంగా వ్యాపిస్తోంది.. దీనికి సంబంధించిన మందుల పనితీరు వంటి అంశాలుపై ఈ వైరస్ లక్షణాలను ప్రభావితం చేసే విషయం ఆధారపడి ఉంటుందని అంటున్నరు.

కాగా... కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగిన నష్టం సంగతి తెలిసిందే. దీనివల్ల అనేక దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి. లక్షల కుటుంబాలు సభ్యులను నష్టపోయాయి. ఆ దారుణాలు ఇప్పుడిప్పుడే మరిచిపోతోన్న సమయంలో... మళ్లీ కొత్త వేరియెంట్ అనే మాటలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి!