Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వానికి ఎన్‌హెచ్ ఆర్ సీ నోటీసులు.. ఏం జ‌రిగింది?

ఏపీ ప్ర‌భుత్వానికి జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌(ఎన్‌హెచ్ ఆర్‌సీ) తాజాగా నోటీసులు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   24 Aug 2024 4:19 AM GMT
ఏపీ ప్ర‌భుత్వానికి ఎన్‌హెచ్ ఆర్ సీ నోటీసులు.. ఏం జ‌రిగింది?
X

ఏపీ ప్ర‌భుత్వానికి జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌(ఎన్‌హెచ్ ఆర్‌సీ) తాజాగా నోటీసులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలోని అపోలో హెల్త్ యూనివర్శిటీలో కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థులు అనారోగ్యం పాలవడం, అనకాపల్లి జిల్లాలోని ఓ అనాథాశ్రమంలో ముగ్గురు చిన్నారులు మరణించడం, మరో 37 మంది అస్వస్థతకు గురైన రెండు ఘటనలపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ రెండు సంఘటనలపై రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

ఎఫ్‌ఐఆర్‌ల స్థితితో పాటు బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి నివేదించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో కలుషిత ఆహారం తిని చాలామంది విద్యార్థులు, చిన్నారులు అనారోగ్యం పాలవడం, ముగ్గురు మరణించడంపై మీడియాలో వచ్చిన వార్తలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఆ రెండు ఘటనలపై వచ్చిన వార్తల ఆధారంగా ఆ కేసులపై సుమోటోగా విచారణ చేపట్టింది. చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్శిటీలో కలుషిత ఆహారం కారణంగా 70 మంది విద్యార్థుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. వారు చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరో ఘటనలో, అనకాపల్లి జిల్లాలోని ఓ అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, మరో 37 మంది అస్వస్థతకు గురయ్యారు. వాళ్లకు అనకాపల్లి, విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తున్నారు. జాతీయ స్థాయిలో వ‌చ్చిన వార్త‌ల్లోని అంశాల ప్రకారం, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని జాతీయ కమిషన్ గుర్తించింది. ఆహార నాణ్యత, ఆరోగ్యాన్ని నిర్ధారించడంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని ఆ రెండు సంఘటనలు సూచిస్తున్నాయ‌ని తెలిపింది. ఆ రెండు ఘటనలపై రెండు వారాల్లోగా సవివరంగా నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది.

ఇవీ సూచ‌న‌లు..

+ ఎఫ్‌ఐఆర్‌ల స్థితి, బాధితుల ఆరోగ్య పరిస్థితిని నివేదించాలని సూచించింది.

+ ఆ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

+ దీనికి సంబంధించి ప్రతిపాదించిన చర్యలను కూడా నివేదికలో ప్రస్తావించాలి.