Begin typing your search above and press return to search.

అమెరికా - రష్యా మధ్యలో భారత్... నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు!

అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర పోషించటంపై మాత్రం భారత్‌ కు విశ్వాసం లేదని ఆమె సంచలన వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   8 Feb 2024 6:27 AM GMT
అమెరికా - రష్యా మధ్యలో భారత్...  నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు!
X

నెవడా రాష్ట్రంలో మంగళవారం ప్రతిపక్ష రిపబ్లికన్‌ ప్రైమరీలో ఓటమి చవిచూసిన నిక్కీ హేలీకి నోటా షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హేలీకి 31 శాతం ఓట్లు రాగా, నోటాకు 63 శాతం రావడం ఆసక్తిగా మారింది. ఆ సంగతి అలా ఉంటే... అటు అమెరికాతోనూ, ఇటు రష్యాతోనూ స్నేహంగా ఉంటూ భారత్ చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తుందంటూ రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... నిక్కీ హేలీ భారత్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అమెరికాకు భాగస్వామిగా ఉండాలనుకుంటుంది కానీ... అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర పోషించటంపై మాత్రం భారత్‌ కు విశ్వాసం లేదని ఆమె సంచలన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రస్తుతం పరిస్థితుల మధ్య భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని.. అందులో భాగంగానే అటు రష్యాతో కూడా సన్నిహితంగా ఉంటూ వస్తోందని వెల్లడించారు.

ఈ సందర్భంగా మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిక్కీ హేలీ... తాను అమెరికా తరఫున భారత వ్యవహారాలనూ చూసినట్లు, ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీతో మాట్లాడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత్.. రష్యాతో కాకుండా అమెరికాతో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారు కానీ, ప్రస్తుతం భారత్ మన నేతృత్వంపై నమ్మకం లేదని అన్నారు. అందుకు కారణం... అమెరికా చాలా బలహీనంగా ఉందని భారత్ భావించడమే అని తెలిపారు.

ఈ క్రమంలో... అమెరికాకు మిత్రదేశాలైన భారత్‌, ఇజ్రాయెల్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణకొరియా, న్యూజిలాండ్‌ కలిసి వస్తాయని తెలిపిన ఆమె ఇతర భాగస్వాములతోనూ సత్సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు! ఈ సందర్హంగా... చైనా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఆ ప్రభుత్వం రోజు రోజుకీ నియంతృత్వంగా మారుతోందని.. గతకొన్నేళ్లుగా వారు అమెరికాతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నారని హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నెవడాలో పరాజయం పాలైన నిక్కీ:

నెవడా రాష్ట్రంలో ప్రతిపక్ష రిపబ్లికన్‌ ప్రైమరీలో నిక్కీ హేలీ ఓటమి చవిచూశారు. ఈ సందర్భంగా... హేలీకి 31 శాతం ఓట్లు రాగా, నోటాకు 63 శాతం వచ్చాయి. 1975లో నోటాను నెవడాలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ కారణంగా ఓటమి చవిచూసిన అభ్యర్థి హేలీయే కావడం గమనార్హం. కాగా... ఆమె స్వరాష్ట్రం దక్షిణ కరోలినాలో ఈ నెల 24న ప్రైమరీ ఎన్నికలు జరుగుతాయి. తదుపరి ప్రైమరీ ఈ నెల 27న మిషిగన్‌ రాష్ట్రంలో జరుగుతుంది!