Begin typing your search above and press return to search.

అమెరికా అధ్య‌క్ష రేసులో నిక్కీహేలీ.. ట్రంప్ త‌ర్వాత రేసులో ఆమే!

అయితే.. ఆమె మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే కొంత వెనుకే ఉండ‌డం గ‌మ‌నార్హం.

By:  Tupaki Desk   |   18 Nov 2023 1:30 AM GMT
అమెరికా అధ్య‌క్ష రేసులో నిక్కీహేలీ.. ట్రంప్ త‌ర్వాత రేసులో ఆమే!
X

వ‌చ్చేఏడాది జ‌ర‌గ‌నున్న అగ్రరాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌ర్వాత.. రేసులో నిక్కీ హేలీ ముందంజలో ఉన్నారు. గ‌తంలో ఐక్య‌రాజ్య‌స‌మితి రాయ‌బారిగా ప‌నిచేసిన ఆమె పేరు అధ్య‌క్ష రేసులో జోరుగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా మిల్‌వాకీ, శాన్‌ఫ్రాన్సిస్కో, ఫ్లోరిడాల్లో GOP నిర్వ‌హించిన మూడు అధ్య‌క్ష చ‌ర్చ‌ల్లో ఆమె వ్య‌వ‌హ‌రించిన తీరుకు ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అయితే.. ఆమె మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే కొంత వెనుకే ఉండ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. జో బైడెన్ త‌ర్వాత అధ్య‌క్ష పీఠాన్ని అందుకునేందుకు తానే స‌రైన, ద్రుఢ‌మైన వ్య‌క్తిన‌ని బ‌లంగా చెబుతున్నారు. ఈ మేర‌కు ప‌లు ప‌త్రిక‌లు కూడా ఈ విష‌యాన్ని పేర్కొంటున్నాయి. ప్ర‌ముఖ ప‌త్రిక వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ క‌థ‌నం మేర‌కు ట్రంప్‌, బైడెన్‌ల త‌ర్వాత 2024లో జ‌రిగే అధ్య‌క్ష రేసులో ఆమె ముందంజ‌లో ఉన్నార‌ని పేర్కొంది.

నిక్కీ హేలీ భార‌త సంత‌తి పౌరురాలు. సిక్కుసామాజిక వ‌ర్గానికి చెందిన హేలీ త‌ల్లిదండ్రులు.. కెన‌డా నుంచి అమెరికాకు వ‌ల‌స వెళ్లారు. నిక్కీ తండ్రి బ‌యోల‌జిస్టు. ఆమె త‌ల్లి ప్ర‌ముఖ లాయ‌ర్‌. త‌ర్వాత కాలంలో బొటెక్ షాప్ ఓన‌ర్‌గా మారారు. ప్ర‌స్తుతం ఈ వ్యాపారం మిలియ‌న్ డాలర్ల‌లో సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి అమెరికాకు వ‌చ్చిన స‌మ‌యంలో వీరి వ‌ద్ద 8 డాల‌ర్లు మాత్ర‌మే ఉండ‌డం మ‌రో విశేషం.

13 సంవత్సరాల వయస్సులో, హేలీ స్టోర్ ఆర్థిక పుస్తకాలను పర్యవేక్షించడం ప్రారంభించింది. 1994లో క్లెమ్సన్ నుండి అకౌంటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత, ఆమె కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయ్యారు. హేలీ భర్త విలియం మైఖేల్ హేలీని కళాశాలలో కలుసుకున్నారు. ఇక్క‌డే వారి మ‌ధ్య ప్రేమ చిగురించింది. దీంతో 1996లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రాజ‌కీయాల్లో ప్ర‌వేశం ఇలా..

రాజకీయాల్లో హేలీ కెరీర్ 2004లో సౌత్ కరోలినా హౌస్‌లో సీటు గెలుచుకోవడంతో ప్రారంభమైంది. హేలీ 2009లో గవర్నర్ పదవికి పోటీ చేసి, సౌత్ కరోలినా గవర్నర్‌గా ఎన్నికైన మొదటి వ్యక్తిగా ఆమె నిలిచారు. అయితే, శ్వేతజాతీయురాలు కాదు. ఇక‌, ఇప్పుడు ఏకంగా అధ్య‌క్ష రేసులో ఉండ‌డం గ‌మ‌నార్హం.