Begin typing your search above and press return to search.

చినరాజప్ప మీద అభ్యర్ధిని డిసైడ్ చేసిన జగన్!

రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న చినరాజప్పకు యాంటీ ఇంకెంబెన్సీ కూడా తోడు అవుతుందని అందుకే ఫ్రెష్ క్యాండిడేట్ గా దొరబాబు విజేత అవుతారు అని వైసీపీ భావిస్తోంది.

By:  Tupaki Desk   |   13 Oct 2023 2:30 AM GMT
చినరాజప్ప మీద అభ్యర్ధిని డిసైడ్ చేసిన జగన్!
X

చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని హోం మంత్రిగా బాధ్యతలను చేపట్టిన నిమ్మకాయల చినరాజప్ప జగన్ వేవ్ లో సైతం పెద్దాపురం నుంచి 2019లో గెలిచారు. ఆయన దూకుడు స్వభావం కలిగిన రాజకీయ నేత కాదు కానీ ఆయనకు ఉన్న సామాజిక బలం, టీడీపీకి ఉన్న పట్టు అన్నీ కలసి పెద్దాపురంలో వరసగా గెలిపిస్తూ వస్తున్నాయి. పెద్దాపురం తెలుగుదేశం పార్టీకి కంచు కోట లాంటి సీటు.

1983 నుంచి ఇప్పటికి తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు టీడీపీయే ఇక్కడ గెలిచింది అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్ధం చేసుకోవాల్సిందే. ఇక కాంగ్రెస్ రెండు సార్లు గెలిస్తే ప్రజారాజ్యం ఒకసారి 2009లో గెలిచింది. 2014 నుంచి చిన రాజప్ప ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఈ నేపధ్యంలో బలమైన ఈ సీటుని సొంతం చేసుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. సామర్లకోట్ల సభలోనే ఆయన చినరాజప్ప మీద పోటీ చేసే వైసీపీ అభ్యర్ధి ఎవరో ప్రకటించేశారు. మీ మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే దొరబాబుని గెలిపించాలని జగన్ కోరడం విశేషం. నియోజకవర్గం అభివృద్ధి పనులకు కూడా దొరబాబు ప్రతిపాదించిన వాటిని ఆమోదిస్తున్నట్లుగా సభలో ఆయన ప్రకటించారు.

ఇక చూస్తే 2019లో పెద్దాపురం నుంచి మాజీ ఎంపీ తోట నరసింహం సతీమణి తోట వాణిని వైసీపీ నిలబెట్టింది. ఆమె బాగానే పెర్ఫార్మెన్స్ చేసింది. ఏకంగా 63 వేల ఓట్లను సాధించింది. అయితే కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఆమెను ఇంచార్జిగా తప్పించి దొరబాబుకు వైసీపీ బాధ్యతలు అప్పగించింది.

దాంతో ఈసారి పోరు రసవత్తరంగా మారనుంది. ఇక్కడ జనసేన కూడా గట్టిగానే ఉంది. ఆ పార్టీకి పాతిక వేలకు పైగా ఓట్లు లభించాయి. దాంతో ఇపుడు జనసేన టీడీపీ కలిస్తే కచ్చితంగా కూటమికి ఎడ్జ్ ఉంటుంది అన్న రాజకీయ గణాంకాలు ఒక వైపు ఉన్నాయి.

అయితే వన్ ప్లస్ వన్ టూ కాదు అన్నది రాజకీయ గణితం చెబుతోంది అంటున్నారు. ఒంటరిగా పోటీ చేయబట్టే జనసేనకు అన్ని ఓట్లు వచ్చాయని, పైగా ఈ సీటుని ఆశిస్తున్న జనసేన నేతలు అసంతృప్తికి లోను అవుతారని కూడా అంటున్నారు. ఓట్ల బదిలీ జరగకపోయినా చినరాజప్ప మీద సొంత పార్టీలో అంతా ఒక్కటిగా నిలవకపోయినా వైసీపీకి అది అడ్వాటేజ్ అవుతుంది అని అంటున్నారు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న చినరాజప్పకు యాంటీ ఇంకెంబెన్సీ కూడా తోడు అవుతుందని అందుకే ఫ్రెష్ క్యాండిడేట్ గా దొరబాబు విజేత అవుతారు అని వైసీపీ భావిస్తోంది. మొత్తానికి జగన్ మాజీ డిప్యూటీ మీద క్యాండిడేట్ ని ప్రకటించి తమ పార్టీ తరఫున తొలి టికెట్ ఇచ్చేశారు.