Begin typing your search above and press return to search.

ఆపరేషన్ బుడమేరు సక్సెస్... మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరకు గండ్లు పడిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Sep 2024 1:11 PM GMT
ఆపరేషన్ బుడమేరు సక్సెస్... మంత్రి కీలక వ్యాఖ్యలు!
X

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరకు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా సుమారు 60వేల క్యూసెక్కుల వరద రావడంతోనే బుడమేరు డైవర్షన్ ఛానల్ కు గండ్లు పడ్డాయి! ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు గండ్లను పూడ్చివేసిన అధికారులు తాజాగా మూడో గండినీ పూడివేశారు. దీంతో... దిగువ ప్రాంతలకు వరద ప్రవాహం ఆగింది!

అవును... బుడమేరు గండ్లను జలవనరుల శాఖ అధికారులు పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చివేసిన అధికారులు తాజాగా మూడో గండిని పూడ్చివేశారు. ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేశారు. ఓ పక్క వరద ఉధృతంగా ఉన్నప్పటికీ రెండు గండ్లను పూడ్చారు. తాజాగా మూడో గండినీ పూడ్చివేశారు.

ఈ విషయంలో ఓ వైపు ఏజెన్సీలు, మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగడంతో ఈ మూడో గండి పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ మేరకు సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్, చెన్నైకి చెందిన 6వ బెటాలియన్ జవాన్లు సుమారు 120 మంది ఇక్కడకు చేరుకుని పని పూర్తిచేశారు!

ఇలా బుడమేరు గండ్లను విజయవంతంగా పూర్తిచేసిన మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు... చిత్తశుద్ధితో అవిరామంగా కష్టపడి ఈ పనులు పూర్తిచేసినట్లు తెలిపారు. వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచుతామని తెలిపారు.

వారం రోజులుగా పంట పొలాలు చెరువులను తలపించాయని.. గండ్లు పూడ్చడంతో ఇప్పుడిప్పుడే పొలాలు బయటపడుతున్నాయని మంత్రి నిమ్మల తెలిపారు. మరోసారి బుడమేరు పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడి, ప్రవాహం పెరిగే అవకాశం ఉందని.. సుమారు 8వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

అయితే ప్రస్తుతం మూడు గండల్నూ పూడివేయడం వల్ల విజయవాడ దిగువ ప్రాంతాలకు బుడమేరు వరద నీరు ఆగిపోయిందని.. నిడమానూరు, జక్కంపూడి, సింగ్ నగర్ వరకూ నిలిచిపోయిన నీటిని కొల్లేరుకు పంపేలా చర్యలు చేపట్టనున్నామని.. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నీరు వెళ్లిపోయేలా చర్యలు చేపట్టామని మంత్రి నిమ్మల తెలిపారు.