‘తల్లికి వందనం’పై మంత్రి నిమ్మల క్లారిటీ
‘తల్లికి వందనం’ పథకంపై ఏపీలో జోరుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 July 2024 12:43 PM GMT‘తల్లికి వందనం’ పథకంపై ఏపీలో జోరుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఒక తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఒక్కొక్కిరికీ 15 వేల రూపాయలిస్తామని చెప్పిన ఎన్డీఏ కూటమి..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం తల్లికి మాత్రమే 15 వేల రూపాయలిస్తాం అని జీవో విడుదల చేసిందని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ప్రచారాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండించారు. తల్లికి వందనం పథకంపై విష ప్రచారం చేస్తున్నారని, 30 రోజులుగా అబద్ధాలు, అసత్యాలు రాస్తున్నారని మండిపడ్డారు. తాము హామీ ఇచ్చిన మాదిరిగానే ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15 వేల రూపాయలిస్తామని చెప్పారు.
ఆ పథకాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లలేదని, ఎంతమందికి ఇవ్వాలి అని కార్యాచరణ రూపొందించలేదని, కానీ, వైసీపీ కరపత్రిక సాక్షిలో మాత్రం విష ప్రచారం మొదలుబెట్టారని రామానాయుడు మండిపడ్డారు. వారేదో పవన్, లోకేష్, చంద్రబాబు మనసులో తొంగి చూసినట్లు కరపత్రాల్లో నింపేస్తున్నారని సాక్షి పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తామని, జగన్ మాదిరి ఒక సంవత్సరం ఎగ్గొట్టకుండా..తల్లికి వందనం పథకం ఐదేళ్లు అమలు చేస్తాం అని నిమ్మల చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణాలను తనిఖీ చేసిన రామానాయుడు అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. కొత్త భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత అధికారులకు క్లాస్ పీకారు. శ్లాబ్ నుంచి వర్షపు నీరు, నిల్వ నీరు లీక్ కావడం చూసి మండిపడ్డారు. మీ ఇళ్లను కూడా ఇలాగే కట్టుకుంటారా? అని అధికారును ప్రశ్నించారు. ప్రభుత్వం మారిందని, పనులన్నీ నాణ్యతతో జరగాలని అధికారులకు ఆదేశించారు. జగన్ ఐదేళ్ల పాలనా విధ్వంసం నూతన భవన నిర్మాణాల్లోనూ కనిపించిందని, ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు ఐదేళ్లయినా గత ప్రభుత్వం పూర్తిచేయలేదని విమర్శించారు.