Begin typing your search above and press return to search.

తొమ్మిది వద్ద ఆగిన వైసీపీ... జగన్ రిలాక్స్ అయినట్లే !

మరి కొద్ది రోజూల్లో లండన్ టూర్ కి వెళ్ళబోతున్న జగన్ కి ముంగిట్లో ఈ రకమైన రాజకీయ సంక్షోభం రాజ్యసభ ఎంపీల నుంచే మొదలు కావడంతో ఏమి చేయాలో పాలు పోని స్థితి అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 9:30 PM GMT
తొమ్మిది వద్ద  ఆగిన  వైసీపీ... జగన్ రిలాక్స్ అయినట్లే !
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుల రాజీనామాలు తలనొప్పులు కలిగిస్తున్నాయి. సైలెంట్ గా ఇద్దరు ఎంపీలు రాజీనామాలు చేశారు. అందులో ఒకరు వైఎస్సార్ కుటుంబం నుంచి విధేయుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ. ఆయన రాజీనామాను ఎవరూ అసలు ఊహించలేదు.

దాంతో వైఎస్సార్ విధేయులు వైసీపీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు అన్న సందేశం జనాల్లోకి వెళ్తోంది. ఈ నేపధ్యంలో మరింత మంది ఎంపీలు జంప్ చేస్తారు అన్న ప్రచారం ఊపందుకోవడం తో జగన్ కి వర్షాకాలంలో ఎండాకాలంగా మారింది. ఏకంగా ఫలానా వారు గోడ దూకుతారు అని పేర్లతో సహా ఒక లిస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ సర్క్యులేట్ కావడంతో ఏమి జరుగుతుందో వైసీపీలో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఈ క్రమంలో ఎవరైతే పార్టీకి దూరం అవుతారు అని ప్రచారం విస్తృతంగా సాగుతోందో వారే మీడియా ముందుకు వచ్చి తాము వైసీపీతోనే ఉంటామని స్పష్టం చేయడంతో జగన్ ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం ఏర్పడింది. వరసగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఆర్ క్రిష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాధరెడ్డి జగన్ తోనే తమ రాజకీయ ప్రయాణం అంటూ ఖండించడంతో వైసీపీకి ప్రస్తుతానికి పెను తుఫాను తప్పిందని అంటున్నారు.

ఇక గత కొద్ది రోజులుగా మారుమోగుతున్న మరో పేరు గొల్ల బాబూరావు. ఆయన కూడా తాజాగా కీలకమైన ప్రకటన చేశారు. తాను వైఎస్సార్ వల్లనే రాజకీయ అరంగేట్రం చేశానని వైఎస్సార్ కుటుంబానికి తాను విధేయుడనని అన్నారు. తాను పార్టీ ఎందుకు మారుతాను అని ప్రశ్నించారు. తనకు ఆ అవసరం లేదని అన్నారు.

తాను మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఆశ్చర్యం తో పాటు బాధ పడుతున్నాను అని చెప్పారు. పార్టీ శ్రేణులకు ప్రజలకు క్లారిటీ ఇవ్వడానికే తాను ఈ విషయం చెబుతున్నాను అని అన్నారు. దాంతో వైసీపీలో ఇపుడు ఒకింత ప్రశాంతత నెలకొంది.

మరి కొద్ది రోజూల్లో లండన్ టూర్ కి వెళ్ళబోతున్న జగన్ కి ముంగిట్లో ఈ రకమైన రాజకీయ సంక్షోభం రాజ్యసభ ఎంపీల నుంచే మొదలు కావడంతో ఏమి చేయాలో పాలు పోని స్థితి అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీలే బయటకు వెళ్లారు అన్న క్లారిటీ వచ్చింది.

అంటే తొమ్మిది మంది వైసీపీతోనే ఉంటారు అన్నది కూడా ఒక స్పష్టత వచ్చింది. సో జగన్ ఈ ప్రకటనలతో ఫుల్ రిలాక్స్ మూడ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. వైసీపీ నుంచి ఎంపీలను లాగాలని చూసిన వారికి తాజా ప్రయత్నంలో పూర్తి స్థాయి విజయం అయితే లభించలేదు అని అంటున్నారు. అయితే ఇది ఆరంభమేనని ఆట ఇంకా ముందుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.