నిఫా ఎఫెక్ట్... కాలేజీ, స్కూళ్లకు సెలవు
అయితే, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినా.. పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని కొజికోడ్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 17 Sep 2023 6:47 AM GMTకేరళలోని కొజికోడ్ జిల్లాను నిఫా వైరస్ కుదిపేస్తోంది. లేదు లేదంటూనే నిఫా వైరస్ కేసులు రోజు రోజుకు ఇక్కడ పెరుగుతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం 24 గంటలూ అప్రమత్తమైంది. మరోవైపు.. కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా హుటాహుటిన చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం నుంచి నిరవధిక సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాస్థంస్థలు అన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినా.. పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని కొజికోడ్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పరీక్ష సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను పాటించాలన్నారు. వాస్తవానికి ఈ నెల 24 వ తేదీ వరకు సెలవులు ప్రకటించినా.. వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ సెలవులను నిరవధికంగా పొడిగిస్తున్నట్టు సర్కారు తెలిపింది.
ఇక, విద్యార్థులకు బోధన విషయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా ఆన్‌లైన్ తరగతులను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. మరోవైపు.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి వీణా జార్జి మాట్లాడుతూ.. నిఫా వైరస్ బారిన పడిన 21 మంది హై రిస్క్ రోగులు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. వీరిలో కొందరు కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
ఐసీఎంఆర్ సూచనలు ఇవీ.. నిఫా వైరస్ వ్యాప్తిపై ఐసీఎంఆర్ పలు సూచనలు చేసింది. కరోనా కంటే కూడా ఈ వైరస్ తీవ్రత ఎక్కువని తెలిపింది. వైరస్ వ్యాప్తి విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని పేర్కొంది. ప్రస్తుత నిఫా వైరస్ బంగ్లాదేశ్ జాతికి చెందినదిగా తెలిపింది. ఈ వైరస్‌లో అధిక మరణాల రేటు నమోదవుతుందని తెలిపింది. వైరస్ సోకిన వారు ఐసోలేషన్‌లో ఉండాలని, మాస్కులు ధరించాలని, తరచుగా చేతులు, కళ్లు శుభ్రం చేసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది.