ఝార్ఖండ్‌లో సంచలనం.. గెలిచిన గంటల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
ఝార్ఖండ్‌లోని ఏజేఎస్‌యూ పార్టీ నుంచి నిర్మల్ మహతో ఏకైక ఎమ్మెల్యే గెలుపొందాడు.
By: Tupaki Desk | 25 Nov 2024 11:30 AM GMTఇటీవల ఝార్ఖండ్, మహారాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి గెలుపొందగా.. ఝార్ఖండ్‌లో మాత్రం ఇండియా కూటమి విజయం సాధించింది. అయితే.. ఝార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే ఎంతో ఖర్చు చేయాలి. ఎంతో కష్టపడాలి. కోట్లాది రూపాయలు డబ్బు పోసినా గెలుస్తామన్న గ్యారంటీ కూడా లేదు. ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత మంది కేవలం పదుల ఓట్లతో గెలుపొందుతుంటారు. అదృష్టం వెంట ఉండడంతో వందల ఓట్లతోని గెలుపొందిన వ్యక్తులూ ఉన్నారు. తాజాగా.. ఝార్ఖండ్ ఎన్నికల్లో 231 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందిన ఓ ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఝార్ఖండ్‌లోని ఏజేఎస్‌యూ పార్టీ నుంచి నిర్మల్ మహతో ఏకైక ఎమ్మెల్యే గెలుపొందాడు. సిల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తన పార్టీ అధినేత సుదేష్ మహతోకు తన మండు స్థానాన్ని ఇచ్చేస్తానంటూ ప్రకటించాడు. తన మండు స్థానానికి రాజీనామా చేస్తానని చెప్పారు బీజేపీ మిత్రపక్షమైన ఏజేఎస్‌యూ పార్టీ ఝార్ఖండ్ ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేసింది. 231 ఓట్ల మెజార్టీతో కేవలం నిర్మల్ మహతో మాత్రమే విజయం సాధించారు. మండులో కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్ భాయ్ పటేల్‌పై ఈయన గెలుపొందారు.
ఈ మేరకు నిర్మల్ మహతో మాట్లాడుతూ తాను సుదేశ్ మహతోకు తన రాజీనామా లేఖను పంపించినట్లు తెలిపారు. దానిని ఆమోదించాలని అభ్యర్థించినట్లు చెప్పారు. మాండులో నిర్మల్ మహతోకు 90,871 ఓట్లు వచ్చాయి. పటేల్‌కు 90,640 ఓట్లు పడ్డాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో ఇదే బీజేపీ అభ్యర్థిగా పటేల్ పోటీచేసి సుమారు 2,000 ఓట్ల తేడాతో మహతోను ఓడించారు. ఆ తరువాత కాంగ్రెస్‌లోకి మారిన తరువాత బీజేపీ మండు సీటును ఏజేఎస్‌యూ పార్టీకి అప్పగించింది. ఇక.. పార్టీ అధినేత సుదేశ్ మహతో సిల్లిలో జేఎంఎం అమిత్‌కుమార్ చేతిలో 23,867 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మరోవైపు.. నిర్మల్ మహతో లేఖపై పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి స్పందించారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.