విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలపై నిర్మలమ్మ కవరింగ్ ఓకే.. లాజిక్ మిస్?
ఒకవేళ.. నిజంగానే భారత మార్కెట్ బాగుండి.. లాభాల స్వీకరణ నేపథ్యంలో విదేశీ మదుపర్లు అమ్మకాలకు తెగబడుతున్నారని అనుకుందాం.
By: Tupaki Desk | 18 Feb 2025 7:30 AM GMTఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ లో చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. గడిచిన కొద్ది రోజులుగా నేలచూపులు చూస్తున్న స్టాక్ మార్కెట్.. గత వారమైతే నష్టాల మోత మోగించటమే కాదు.. దారుణ నష్టాల్ని తీసుకొచ్చేలా చేసింది. మార్కెట్ బులీష్ ట్రెండ్ కు ప్రధాన కారణం విదేశీ సంస్థాగత మదుపర్లు ఎడాపెడా అమ్మకాల్ని చేపట్టటంతో మార్కెట్లు డౌన్ అవుతున్నాయి. ఈ తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇలాంటి వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిస్థితిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. స్టాక్ మార్కెట్ తిరోగమనం వెనుక ప్రత్యేక కారణం లేదన్నట్లుగా మాట్లాడిన ఆమె.. మన దగ్గర పెట్టుబడులు పెడితే మరింత చక్కటి రిటర్న్ లు వస్తున్నాయని.. అందుకే అమ్మకాలకు దిగుతున్నట్లుగా చెబుతున్నారు. నిర్మలమ్మ మాటలు వినేందుకు బాగానే ఉన్ట్లు కనిపించినా.. అందులో లాజిక్ మిస్ అయిన కోణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఒకవేళ.. నిజంగానే భారత మార్కెట్ బాగుండి.. లాభాల స్వీకరణ నేపథ్యంలో విదేశీ మదుపర్లు అమ్మకాలకు తెగబడుతున్నారని అనుకుందాం. కానీ.. ఇప్పుడు పలు స్టాక్ లు కనిష్ఠాన్ని నమోదు చేసుకుంటున్నాయి. ఇలాంటి వేళలో అమ్మకాలు చేపడితే నష్టమే తప్పించి లాభం కాదు కదా? లాభాలు వస్తాయన్న నమ్మకం ఉన్నప్పుడు చూస్తూ.. చూస్తూ నష్టాలకు ఎందుకు అమ్మకాలు చేపడతారన్నది ఒక లాజిక్. ఈ విషయంపై కేంద్ర మంత్రి వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది.
భారత ఎకానమీలో పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నట్లుగా చెప్పిన నిర్మలమ్మ మాటలే నిజమైతే..మరింత భారీగా కొనుగోళ్లు జరుగుతాయే తప్పించి అమ్మకాలకు తెగబడరు కదా? అంతేకాదు.. గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటివరకు రూ.1.56 లక్షలకోట్ల మేర స్టాక్స్ అమ్మినట్లుగా చెబుతున్నారు. ఇక్కడ గుర్తించాల్సిన చేదు నిజం ఏమంటే.. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.లక్ష కోట్ల మేర స్టాక్స్ అమ్మకాలు సాగటమే. నష్టాల జోరు నడుస్తున్న వేళ.. విదేశీ మదుపరులు అమ్మకాలకు తెగ బడటం వెనుక అసలు కారణం ఇంకేదో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.