వ్యక్తిగా కాదు.. శక్తిగా ఎదగండి: బడ్జెట్‌లో కేంద్రం వరాలు!
ఈ క్రమంలో ఎమ్ ఎస్ ఎమ్ ఈ(చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు)లకు.. రుణాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 1 Feb 2025 10:29 AM GMTతాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో.. ఉద్యోగాల కల్పనపై పెద్దగా ఎక్కడా ప్రస్తావించ లేదు. ఇది ఒకరకంగా.. నిరుద్యోగులకు మింగుడు పడని వ్యవహారమే. కానీ, ఇదే సమయంలో కేంద్రం చిన్న, సూక్ష్మ, మధ్య తరహా .. పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు చక్కని ఊతం అందిస్తోంది. అంటే.. ఉద్యోగం సంపాయించుకుని వ్యక్తిగా ఎదగడం కాదు.. పరిశ్రమను స్థాపించి.. శక్తిగా ఎదగాలంటూ.. పరోక్షంగా మోడీ సర్కారు దేశంలోని యువతకు వెన్నుదన్నుగా నిలిచింది. ఈ క్రమంలో ఎమ్ ఎస్ ఎమ్ ఈ(చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు)లకు.. రుణాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
చిన్న స్థాయిలో పెట్టుబడులు పెట్టుకుని.. పరిశ్రమలు స్థాపించే వారికి తాజా బడ్జెట్లో కేంద్రం ఊతమిచ్చింది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా చిన్న తరహా, స్టార్టప్‌లపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి బడ్జెట్ లో వరాలు ప్రకటించింది. కొత్తగా పరిశ్రమలు స్థాపించేవారికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌లు ఏర్పాటు చేసేవారికిగరిష్ఠంగా 20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వారికి ప్రత్యేక క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నట్టు తెలిపారు.
ఉభయ కుశలోపరి!
ఉద్యోగాలు కల్పించడం లేదన్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు.. మరోవైపు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాబడులను పెంచుకునేందుకు కూడా.. తాజా నిర్ణయం దోహద పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల కల్పన అనేది ఇప్పుడు ప్రభుత్వాలకు కత్తిమీద సాముగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా చిన్నపాటి పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా.. ఒక వ్యక్తి ద్వారా ఇద్దరికి ఉపాధి లభించినా.. ప్రభుత్వంపై భారం తప్పుతుంది. పైగా.. పన్నుల రూపంలో ఆదాయం కూడా లభిస్తుంది. ఇలా .. ఉభయ కుశలోపరి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తోంది.
ఈ క్రమంలోనే చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఎంఎస్‌ఎంఈ రుణం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు ఇప్పించేందుకు రెడీ అయినట్టు 2025-26 వార్షిక బడ్జెట్‌లో స్పష్టం చేసింది. ఇవేకాకుండా.. మహిళలకు.. డెయిరీ, ఫిషరీ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే.. వారికి వ్యక్తిగతంగా రూ.5 లక్షల వరకు రుణం ఇవ్వనున్నారు. దేశ వ్యాప్తంగా యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహిం చి, వారి కాళ్ల మీద నిలబడేలా.. వ్యక్తిగా కాదు.. శక్తిగా మారేలా.. ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లకు రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించిన్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.