Begin typing your search above and press return to search.

అమరావతికి 15 వేల కోట్లు పక్కా లోన్?

ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా విడగొట్టారు. ఆ తరువాత ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని బీజేపీ పెద్దలు చెప్పారు.

By:  Tupaki Desk   |   23 July 2024 1:32 PM GMT
అమరావతికి 15 వేల కోట్లు పక్కా లోన్?
X

అవును అమరావతి రాజధాని కోసం కేంద్రం ఉదారంగా ఆర్ధిక సాయం చేయడం లేదు. అంతే కాదు, ప్రత్యేక గ్రాంటుని కూడా రిలీజ్ చేయడం లేదు. నిజానికి అమరావతి రాజధానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఎందుకంటే అది విభజన చట్టంలో ఉంది. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా విడగొట్టారు. ఆ తరువాత ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని బీజేపీ పెద్దలు చెప్పారు.

పదేళ్ళుగా రాజధాని లేదు, ఇపుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.దానికి ప్రాణవాయువుని ఏపీలోని 16 మంది టీడీపీ ఇద్దరు జనసేన ఎంపీలు అందిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు లో అత్యంత కీలక పాత్ర పోషించిన ఏపీకి కేంద్రం తిరిగి ఏమి ఇస్తుంది ఎలా రుణం తీర్చుకుంటుంది అంటే రుణంతోనే అని అంటున్నారు.

అంటే ఏపీకి రుణం ఇప్పించడమే గొప్ప అని కేంద్రం అనుకుంటే అదే బాగుందని ఏపీలోని కూటమి పెద్దలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అమరావతి రాజధానికి 15 వేల కోట్లు నిధులు ఇచ్చారని టీడీపీ జనసేన ఒక వైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ఆర్ధిక మంత్రి మీడియాతో మాట్లాడినపుడు అసలు విషయం బోధపడింది.

అదేంటి అంటే ప్రపంచ బ్యాంక్ ద్వారా ఆర్ధిక సాయం అందేలా చూస్తామని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ అంటే రుణాలు ఇచ్చేదే తప్ప ఉచితంగా ఇవ్వదు. మరి ఆ విధంగా ఆలోచిస్తే ఏపీకి ఇచ్చే పదిహేను వేల కోట్ల రూపాయల రుణమే తప్ప ఆర్ధిక సాయం ఏ మాత్రం కాదని అర్ధం అవుతోంది అంటున్నారు.

ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో ఉందని కేంద్ర మంత్రి అంటూనే దాని ప్రకారం రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏపీ తన వాటా భరిస్తుందా లేదా అనేది చూడాలని కేంద్ర మంత్రి చెప్పారు. ఇక ఏది ఎలా ఉన్నా కేంద్రం మాత్రం దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.

అంటే ప్రపంచ బ్యాంక్ రుణానికి సంబంధించి కేంద్రం పూచీకత్తు తీసుకునే బాధ్యతను కేంద్ర మంత్రి చెప్పారని అంటున్నారు. ప్రపంచ బ్యాంకు రుణం తీసుకుని దానితో అమరావతి రాజధాని నిర్మాణం చేసుకోవాలని కేంద్రం చెప్పినట్లుగా ఉంది అని అంటున్నారు. ప్రపంచ బ్యాంకు ఎవరికీ ఉచితంగా రుణం ఇవ్వదు అన్నది తెలిసిందే. ఆ నేపధ్యంలో కేంద్రం మధ్యవర్తిగా ఉంటుందని అంటున్నారు. అదే ఏపీకి అమరావతికి కేంద్రం చేసే సాయమని భావించాలా అన్నది మేధావుల మాటగా ఉంది.

మరో వైపు చూస్తే గవర్నర్ కి ధన్యవాదాలు తెలిపే అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే నిధులు ఏ రూపంలో వచ్చినా రాష్ట్రానికి ఎంతో ఉపయోగం అని స్పష్టం చేశారు. ఆర్థికంగా కుంగుబాటుకు గురైన ఏపీకి ఈ నిధులు ఎంతో ఉపయుక్తమని అన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి అన్ని విధాల తోడ్పాటు అందించే విధంగా ఉందని కూడా బాబు సంతృప్తి వ్యక్తం చేశారు. తాము పెట్టిన ప్రతిపాదనలను చాలావరకు ఆమోదించారని ఆయన అన్నారు. అమరావతి రాజధానికి నిధుల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని కూడా చంద్రబాబు తెలిపారు.

అదే సమయంలో అమరావతి రాజధాని నిర్మాణం ఊపందుకోవాలంటే ఈ నిధులు ఉపయోగపడతాయి. ఇక వివిధ ఏజెన్సీల నుంచి అందే నిధులు అప్పుల రూపంలోనే అయినా వాటిని తీర్చేది 30 ఏళ్ల తర్వాతే అని కూడా చంద్రబాబు చెప్పడం విశేషం. అలా వివిధ సంస్థల నుంచి వచ్చే అప్పును కేంద్రం పూచీకత్తుతో ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అందులోనే కొంత కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ క్యాపిటల్ అసిస్టెన్స్ రూపంలో కలిసి ఉంటుందని ఆయన అంటున్నారు. అలాగే పోలవరం పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందని కూడా బాబు గుర్తు చేశారు.

మొత్తానికి అమరావతి రాజధానికి రుణం ఇస్తున్నారన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసా అంటే చంద్రబాబు చెప్పిన దానిని బట్టి అదే అనుకోవాలని అంటున్నారు. అప్పు అయినా ముప్పయ్యేళ్ల తరువాత తీరుస్తామని బాబు అనడం బట్టి కేంద్రం ఈ విషయంలో ఏపీకి ప్రత్యేకంగా చేసిన సాయం ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది.

మరో వైపు చూస్తే బీజేపీ ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్ మాత్రం అమరావతి రాజధానికి ఇచ్చే రూ.15 వేల కోట్ల రూపాయలు మొత్తం బాధ్యత కేంద్రనిది అని అంటున్నారు. ఈ విషయంలో రాష్ట్రంపై రూపాయి భారం పడదని చెబుతున్నారు. ఈ అప్పు మొత్తం కేంద్రమే కట్టుకుంటుందని వారు అంటున్నారు. మరి ప్రపంచ బ్యాంక్ ద్వారా వచ్చే నిధులు టెరంస్ అండ్ కండిషన్లు అన్నీ చూస్తేనే తప్ప ఏపీ మీద ఎంత భారం పడుతుంది అన్నది తెలియదు అని కూడా అంటున్నారు. మొత్తానికి అమరావతి మీద కేంద్రం రుణం ఈ విధంగా తీర్చుకుంటోంది అన్న సెటైర్లు అయితే పడుతున్నాయి.