Begin typing your search above and press return to search.

దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం కుదురుతుందా?

ఈ నేపథ్యంలో దేశ విభజన వ్యాఖ్యలు చేసిన కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేశ్‌ పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ధ్వజమెత్తారు.

By:  Tupaki Desk   |   29 Feb 2024 7:10 AM GMT
దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం కుదురుతుందా?
X

ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష కొనసాగుతోందనే విమర్శలు ఉన్నాయి. దేశానికి ప్రధానమంత్రిగా చేసే అవకాశం ఇప్పటివరకు కేవలం ఇద్దరు దక్షిణ భారతీయులకే దక్కింది. వీరిలో ఒకరు పీవీ నరసింహారావు కాగా, మరొకరు దేవగౌడ. పీవీ ఐదేళ్లు పదవిలో ఉండగా దేవగౌడ కేవలం ఏడాది పాటే ప్రధానిగా ఉన్నారు.

ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువ ఆదాయం వస్తుందని.. కానీ కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు మాత్రం దక్షిణ బారతదేశం కంటే ఉత్తర భారతదేశానికే అత్యధికంగా ఉంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

వాస్తవానికి దేశ రెండో రాజధానిగా దక్షిణ భారతదేశం నుంచి ఒక నగరం ఉండాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. బీఆర్‌ అంబేడ్కర్‌ సైతం దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి తలెత్తకుండా దేశ రెండో రాజధానిని దక్షిణ భారత రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో బడ్జెట్‌ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, ఇదే కొనసాగితే.. దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ పెరుగుతుందని ఇటీవల కర్ణాటక కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి.

ఈ నేపథ్యంలో దేశ విభజన వ్యాఖ్యలు చేసిన కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేశ్‌ పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ధ్వజమెత్తారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీతారామన్‌ దక్షిణ భారత రాష్ట్రాలకు నిధుల కేటాయింపుపై వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు.

నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘానికి కట్టుబడి ఉంటుందన్నారు. దాని పాత్ర అంతవరకే పరిమితమని తెలిపారు. ఒక వేళ నిధులు పొందాలనుకుంటే ఆర్థిక సంఘానికి రాష్ట్రాలు తమ సమస్యలు చెప్పుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్థిక సంఘం ఒప్పుకుంటే అప్పుడు నిధులు మంజూరు అవుతాయన్నారు.

దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో బలం ఉంటుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలను వేరుగా పరిగణించలేమని స్పష్టం చేశారు. వాటన్నింటిని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని హెచ్చరించారు.

దక్షిణాది రాష్ట్రాలు ఇండెక్స్‌ లో మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. డీకే సురేశ్‌ ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్‌ సభ్యుడిగా ఉంటూ దేశ విభజన డిమాండ్‌ చేస్తున్నారని.. ఆయన వ్యాఖ్యలు తప్పు అని వ్యాఖ్యానించారు.

కాగా డీకే సురేశ్‌ చేసిన దేశ విభజన వ్యాఖ్యలపై ఇటీవల పార్లమెంట్‌ దద్దరిల్లింది. సురేశ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనేదే కాంగ్రెస్‌ సిద్ధాంతమని వెల్లడించారు. విభజన కోరే వారికి పార్టీ ఎప్పటికీ మద్దతు తెలపదని స్పష్టం చేశారు.