లెక్కలు బయట పెట్టిన నిర్మలమ్మ.. కాంగ్రెస్‌కు సౌండ్ కట్!
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో మోడీ సర్కారు కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 31 July 2024 4:00 AM GMTప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో మోడీ సర్కారు కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు, బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో అన్యాయం చేశారని.. కనీసం కేటాయింపులు లేకుండానే బడ్జెట్ను వండివార్చారని.. ఆయా పార్టీల తరఫున కాంగ్రెస్ గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. అసలు బడ్జెట్‌లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల(ఇవన్నీ ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో ఉన్నాయి) ఊసే లేకుండా బడ్జెట్ను వండి వార్చారని కూడా విమర్శలు గుప్పించింది.
ఈ నేపథ్యంలో నిర్మల తాజాగా మంగళవారం నాటి సభలో కాంగ్రెస్ విమర్శలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాల పేరు చెప్పకపోయినా .. ఆయా రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో అన్యాయం చేయలేదన్నారు. అంతేకాదు.. 2004-2014 మధ్య యూపీఏ ప్రభుత్వం కంటే కూడా తాము ఎక్కువగానే రాష్ట్రాలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ వివక్ష పూరిత పాలన చేసిందని.. కానీ, తాము అలా చేయడం లేదని చెప్పారు.
రాష్ట్రాల వారీగా కాకుండా.. దేశాన్ని ఒక యూనిట్గా తీసుకుని కేటాయింపులు చేస్తూ.. అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తున్నామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు చేస్తున్న కేటాయింపులను ఆమె వివరించారు. ఇదేసమయంలో గత కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వివక్షను ప్రదర్శించిందో కూడా వివరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు సౌండ్ లేకుండా పోయింది.
తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపులు..
+ తెలంగాణ, మహారాష్ట్ర రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు కేటాయింపు.
+ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు `పీఎం మిత్ర` పేరుతో టెక్స్ టైల్ పార్కులు.
+ ఈ మూడు రాష్ట్రాలకు గ్రీన్ ఫీల్డ్ పార్కులకు రూ.500 కోట్లు కేటాయింపు.
+ ఈ మూడు రాష్ట్రాలకే బ్రౌన్ ఫీల్డ్ పార్కులకు రూ.200 కోట్లు కేటాయింపు.
+ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు మంజూరు.
+ ఏపీ, తెలంగాణ మధ్య మోటుమర్రి-విష్ణుపురం(పల్నాడు) సెక్షన్లలో రైల్వే డబ్లింగ్ పనులు
+ మడికసిర(అనంతపురం), మేడ్చల్, మహబూబ్ నగర్, డోన్ మార్గంలో డబ్లింగ్ పనులు.
+ భద్రాచలం, డోర్నకల్ సెక్షన్లలో రైల్వే పనులకు రూ.12,334 కోట్ల నిధులు కేటాయింపు.
యూపీఏ హయాంలో కేటాయింపులు ఇవీ..
+ 2009-10 బడ్జెట్‌లో బీహార్, యూపీకి అధికంగా నిధుల కేటాయింపు.
+ 2009-10 బడ్జెట్‌లో 26 రాష్ట్రాల ప్రస్తావన లేకుండానే బడ్జెట్ ప్రసంగం.
+ 2010-11 బడ్జెట్‌లో 11 రాష్ట్రాలను విస్మరించారు.
+ 2011-12లో 15 రాష్ట్రాల ఊసే లేదు.
+ 2012-13లో 16 రాష్ట్రాల గురించి పట్టించుకోలేదు.
+ 2013-14లో 10 రాష్ట్రాల కు ఎలాంటి కేటాయింపులు జరపలేదు.