‘ఫండ్స్’ లేని ఆర్థికమంత్రి!.. అందుకే ఎన్నికల్లో పోటీకి దూరం!
మోడీ సర్కారులో ఆర్థికమంత్రి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 28 March 2024 4:27 AM GMTమోడీ సర్కారులో ఆర్థికమంత్రి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుకు చెందిన ఆమె ఏపీకి కోడలుగా రావటం తెలిసిందే. సమర్థ ఆర్థికమంత్రిగా పేరున్న ఆమె.. తన వేషభాషలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. సింఫుల్ గా ఉంటూ పక్కింటి ఆమె తరహాలో వ్యవహరించే ఆమె వాగ్దాటి ఎంతన్నది అందరికి సుపరిచితమే. తాజాగా ఆమె నోటి నుంచి ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి ఆమె దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎందుకిలా? అన్న ప్రశ్నకు ఊహించని రీతిలో ఆమె నుంచి సమాధానాలు రావటం గమనార్హం.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు (ఫండ్స్) తన వద్ద లేవని.. అందుకే తాను ఎన్నికల బరిలో దిగలేనని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలియజేశానని చెప్పారు. వారం.. పది రోజులు ఆలోచించిన తర్వాత కుదరకపోవచ్చని చెప్పానని.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరిపడా డబ్బుల్లేవన్నారు. ‘ఏపీ లేదంటే తమిళనాడులో ఏదైనా సరే నాకో సమస్య ఉంది. అక్కడ గెలుపు కులం.. మతం లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుంటారు. అవన్నీ నేను చేయలేను. అందుకే పోటీ చేయనని వారికి చెప్పా. వారు నా వాదనను అంగీకరించటం గొప్ప విషయం. అయితే.. పార్టీకి చెందిన ఇతర అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తా’’ అంటూ ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
దేశ ఆర్థికమంత్రిగా ఉంటే లక్షల కోట్ల బడ్జెట్ ను సమర్థంగా నిర్వహించే మీ దగ్గర ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఆర్థిక నిధులు లేవా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో ఆమె మరింత వివరంగా సమాధానం ఇవ్వటం గమనార్హం. ‘‘నా జీతం.. నా సంపద.. నా పొదువు మాత్రమే నావి. కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మాత్రం నాది కాదు కదా?’ అంటూ వ్యాఖ్యానించారు.
బీజేపీ విషయానికి వస్తే.. ప్రస్తుతం పలువురు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నికల బరిలోకి దింపుతోంది. పీయూష్ గోయల్.. భూపేంద్ర యాదవ్.. చంద్రశేఖర్.. మన్ సుఖీ మాండవీయ.. జ్యోతిరాదిత్య సింధియాలాంటి నేతల పేర్లు పోటీ చేసే వారి జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మిగిలిన వారికి భిన్నంగా రాజ్యసభ సభ్యురాలైన నిర్మలా సీతారామన్ తీరు ఉండటం ఆసక్తికర చర్చగా మారింది.