మధ్యంతరానికి తగ్గట్లే.. నిర్మలమ్మ సింఫుల్ స్పీచ్
ఏడాదికి ఒకసారి ప్రవేశ పెట్టే జాతీయ బడ్జెట్ మీద దేశ జనులకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు.
By: Tupaki Desk | 1 Feb 2024 9:18 AM GMTఏడాదికి ఒకసారి ప్రవేశ పెట్టే జాతీయ బడ్జెట్ మీద దేశ జనులకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో కాస్తంత తగ్గింది కానీ.. గతంలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారన్నంతనే.. వారం ముందు నుంచి హడావుడి వేరుగా ఉండేది. మారిన కాలానికి తగ్గట్లు.. ఇప్పుడు బడ్జెట్ మీద వెనుకటి రోజుల్లో ఉన్న ఆసక్తి వ్యక్తం కావటం లేదు. మరీ ముఖ్యంగా మోడీ సర్కారు కేంద్రంలో కొలువు తీరిన తర్వాత.. బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ ను కలిపేయటం ఒక ఎత్తు.. బడ్జెట్ లోనూ ఆసక్తికర నిర్ణయాలు పెద్దగా తీసుకోకపోవటంతో దానికి ఉండే ప్రత్యేకత అంతకంతకూ తగ్గుతూ వస్తోంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ లో ఆసక్తికర విశేషాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఆ మాటకు వస్తే.. ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని గంట కంటే తక్కువ వ్యవధిలోనే ముగించటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా బడ్జెట్ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి రెండు గంటలకు తగ్గకుండా ప్రసంగించటం ఉంటుంది. త్వరలో జరిగే ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో తాజా బడ్జెట్ కేవలం ఈరెండు.. మూడు నెలలకు మాత్రమే సంబంధించింది.
అందుకే కాబోలు.. కేంద్ర మంత్రి సైతం తన ప్రసంగాన్ని కుదించేశారు. ఆమె ఇప్పటివరకు చేసిన బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అతి తక్కువ సమయం ఉన్న ప్రసంగంగా చెప్పాలి. ఆమె దేశ పద్దును కేవలం 57 నిమిషాల్లో ముగించారు. లోక్ సభ వేదికగా ఆమె చేసిన ప్రసంగానికి మరో ప్రత్యేకత ఉంది. కొత్తగా పార్లమెంటు భవనం ఏర్పాటు చేసిన తర్వాత ప్రవేవ పెట్టిన తొలి బడ్జెట్ గా దీన్ని చెప్పాలి.
అతి తక్కువ సమయంలోనే తన పద్దు ప్రసంగాన్ని పూర్తి చేసిన నిర్మలమ్మ ఖాతాలో ఆసక్తికర రికార్డు ఒకటి ఉంది. అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగాన్ని చేసిన రికార్డు కూడా ఆమెనే. 2020-21లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంలో ఆమె ఏకంగా 162 నిమిషాలు.. దాదాపు ఒక పెద్దసినిమా స్థాయిలో తన బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. ఆ రోజున ఆమె ఆరోగ్యం సరిగా లేదు. ఈ కారణంగా మరో రెండు పేజీల బడ్జెట్ ప్రసంగం ఉన్నప్పటికీ ముగించేశారు. బడ్జెట్ చరిత్రలో ఇప్పటివరకు అదే అతి సుదీర్ఘమైన ప్రసంగంగా చెబుతారు. 2019-20లో రెండో అతి పెద్ద ప్రసంగాన్ని చేశారు. ఆ బడ్జెట్ ప్రసంగం 137 నిమిషాలు సాగింది. గత ఏడాది విషయానికి వస్తే.. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగాన్ని 86 నిమిషాల్లో ముగించారు. గత ఏడాది కంటే.. 29 నిమిషాలు ముందే ముగించేయటం గమనార్హం.