Begin typing your search above and press return to search.

బీహార్ కి కొత్త వారసుడు : నిశాంత్ సన్ ఆఫ్ నితీష్

ఆయన రాజకీయ జీవితం సుదీర్ఘమైనది. ఒకనాడు బీహార్ కి సీఎం కావాలని కలలు కన్నారు నితీష్.

By:  Tupaki Desk   |   23 March 2025 11:47 PM IST
బీహార్ కి కొత్త వారసుడు : నిశాంత్ సన్ ఆఫ్ నితీష్
X

నితీష్ కుమార్ బీహార్ సీఎం. ఆయన రాజకీయంగా నిబద్ధత కలిగిన నాయకుడు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయప్రకాష్ నారాయణ్ వంటి వారి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1970 దశకం మధ్య నుంచి చురుకైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 1985లో తొలిసారి బీహార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తరువాత ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా కూడా గెలుస్తూ వచ్చారు.

ఆయన రాజకీయ జీవితం సుదీర్ఘమైనది. ఒకనాడు బీహార్ కి సీఎం కావాలని కలలు కన్నారు నితీష్. మొదటిసారి సీఎం అయితే రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం పడిపోయింది. కానీ ఆ తరువాత అంటే 2005 నుంచి ఈ రోజు దాకా మధ్యలో కొద్ది నెలలు తపించి నితీష్ కుమార్ బీహార్ ని నిరాటంకంగా ఏలుతున్నారు. ఆయన బీహార్ ని ఇన్నేళ్ళు పాలించిన నేతగా రికార్డుకు ఎక్కారు.

అంతే కాదు మంచి పాలనను కూడా అందించారన్న పేరు సంపాదించారు. ఇక నితీష్ కుమార్ కి ఒక్కరే కుమారుడు. పేరు నిశాంత్ కుమార్. ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్. రాజకీయాలకు బహు దూరం. నాకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు అని చెప్పే నిశాంత్ ఇపుడు బీహార్ తెర మీద కనిపిస్తున్నారు. అంతే కాదు ఆయన నరేంద్ర మోడీ పాలన బాగుందని అంటున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నెలలలో బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. జేడీయూకి అధినేత నితీష్ కుమార్. ఆయన తరువాత వారసుడిగా నిశాంత్ ఎస్టాబ్లిష్ కావాలని కోరుకుంటున్నారు.

అయితే ఇప్పటికే బాగా ఆలస్యం అయింది అని అంతా అంటున్నారు. లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ మాదిరిగా అదే విధంగా రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ మాదిరిగా నిశాంత్ కుమార్ తండ్రి నుంచి నేరుగా రాజకీయాలను అందుకోలేదు రాజకీయాల వైపు చూడలేదు. ఇపుడు ఆల్ ఆఫ్ సడెన్ గా వస్తే ఆయనకు ఎంత వరకూ ఆదరణ ఉంటుంది అన్నది చర్చగా ఉంది.

మరో వైపు చూస్తే నితీష్ కుమార్ సైతం వారసత్వ రాజకీయాలను ఎక్కడా ప్రోత్సహించలేదు. తనతోనే అంతా అనుకున్నారు. కానీ నితీష్ ఇపుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. దాంతోనే నిశాంత్ రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది అని అంటున్నారు.

బీహార్ రాజకీయాల్లో బీజేపీ తమ ముఖ్యమంత్రిని చూడాలని అనుకుంటోంది. అదే విధంగా జేడీయూలో కూడా సీనియర్ నేతలు కొందరు నితీష్ ప్లేస్ లోకి రావాలని చూస్తున్నారు. ఈ విధమైన పరిస్థితుల నేపథ్యంలో నిశాంత్ కనుక రాజకీయాల్లోకి సీరియస్ గా వస్తే తండ్రి లెగసీని కొనసాగించగలరా అన్నది చర్చగా ఉంది. ఆయన దాదాపుగా యాభై ఏళ్ళ వయసులో ఉన్నారు.

ఈ ఏజ్ లో రాజకీయంగా ఒక స్థిరమైన పదవిలో ఉంటూ కొనసాగాల్సి ఉంది. ఇంకా ఓనమాలు మొదలెడితే బీహార్ లాంటి గట్టి పోటీ ఉన్న చోట నిషాంత్ ఎంత మేరకు నెగ్గుకుని రాగలరు అన్నది చర్చగా ఉంది. అయితే బీజేపీ నితీష్ రాజకీయ ముద్రని కొనసాగించేందుకు నిశాంత్ ని ప్రోత్సహించినా ఆయనను ఎమ్మెల్యేగా లేక మంత్రి వరకూ తీసుకుని రావచ్చేమో కానీ సీఎం పదవి అయితే దక్కదని అంటున్నారు.

అదే విధంగా పార్టీని నడపడం కీలక పదవులు చేపట్టి జనాలకు చేరువ కావడం అన్నది బిగ్ టాస్క్ అని అంటున్నారు. ఇక నిశాంత్ రాజకీయ ఆగమమం మీద బీహార్ రాజకీయ పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఆయన ఏమి చేయగలరో చూడాలని అంటున్నాయి.

మోడీని అంకుల్ అని సంభోదిస్తూ దేశం కోసం మోడీ అని రాష్ట్రం కోసం నితీష్ అని నినదిస్తున్న నిషాంత్ తొందరలోనే తనదైన రాజకీయం చూపిస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. సో బీహార్ కొత్త వారసుడిని చూడబోతోంది అన్న మాట. వారసులకు పెద్ద పీట వేయడం ఈ దేశంలో ఆది నుంచి ఉంది. అయితే అదే సమయంలో వారు తమ టాలెంట్ ని కూడా రుజువు చేసుకుంటేనే రాణించేది అన్నది కూడా ఉంది.