Begin typing your search above and press return to search.

ఎన్డీఏలోని ఆ కీలక సీఎంకు అనారోగ్యం.. వారసుడి ప్రవేశంపై ఊహాగానాలు!

కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)కు ఆ రెండు పార్టీలే చాలా కీలకం.

By:  Tupaki Desk   |   24 Feb 2025 4:30 PM GMT
ఎన్డీఏలోని ఆ కీలక సీఎంకు అనారోగ్యం.. వారసుడి ప్రవేశంపై ఊహాగానాలు!
X

కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)కు ఆ రెండు పార్టీలే చాలా కీలకం. కూటమిలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలుగా ఉన్న ఈ పార్టీలను మోదీ సర్కారు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదంటూ ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తుంటాయి. యాక్సిడెంటల్ గా చూసినా ఈ రెండు పార్టీల అధినేతలు ప్రధాని మోదీ కంటే సీనియర్లు. వయసులో మాత్రం ముగ్గురూ ఒకటే వయసు వారు.

పైన చెప్పుకొన్న రెండు పార్టీల్లో ఒకటి తెలుగుదేశం (టీడీపీ). ఏపీలోని ఎన్డీఏ కూటమి సర్కారులో ప్రధాన పార్టీ. దీని అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం. వయసు 75కు దగ్గరవుతున్నా చంద్రబాబు ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదు. 50 ఏళ్ల వయసు వాడిలా ఆయన హుషారుగా పనిచేస్తుంటారు. 16 సీట్లతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అత్యంత కీలక మద్దతుదారు అయినా.. తన పరిమితులు గుర్తెరిగి వ్యవహరిస్తుంటారు. అసలు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే ఉద్దేశమే ఆయనకు కనిపించడం లేదు.

ఎన్డీఏలో మరో పెద్ద పార్టీ బిహార్ లోని జేడీయూ. దీని వ్యవస్థాపకుడు నీతీశ్ కుమార్. 15 ఏళ్లకు పైగా బిహార్ సీఎంగా ఉన్న ఆయన గత ఎన్నికల అనంతరం అటు ఆర్జేడీ- కాంగ్రెస్ శిబిరం వైపు ఇటు బీజేపీ కూటమితో దోబూచులాడారు. చివరకు బీజేపీతో కలిశారు. నిరుడు లోక్ సభ ఎన్నికల్లో కాషాయ పార్టీతో కలిసి పోటీ చేసి 12 ఎంపీ సీట్లు సాధించారు.

నీతీశ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ కీలక నేతలు, సీఎంలు హాజరైనా నీతీశ్ మాత్రం రాలేదు. దీంతోనే నీతీశ్ అనారోగ్య సమస్యపై ప్రతిపక్షాలు సైతం ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

నీతీశ్ కుమార్ నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రంపై తాజాగా కథనాలు వస్తున్నాయి. నీతీశ్ అనారోగ్య కారణాలతో నిశాంత్ కు పగ్గాలు అప్పగిస్తారని అంటున్నారు. అయితే, తన తండ్రి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిశాంత్ చెబుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న తన తండ్రిని మరోసారి సీఎం చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ ఏడాది నవంబరులో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి.

కాగా ఎన్‌డీఏలో బీజేపీకి 240, టీడీపీకి 16, జేడీయూకి 12, శివ‌సేన (శిందే)కు 7, ఎల్‌జేపీకి 5, జేడీఎస్‌ కు 2, జ‌న‌సేనకు 2, ఆర్ఎల్‌డీకి 2, ఎన్‌సీపీ (అజిత్ ప‌వార్‌)కి 1, అప్నాద‌ళ్ కు 1, ఏజేపీకి 1, ఏజేఎస్‌యూకు 1, హెచ్ఏఏంకు 1, ఎస్‌కేఎంకు 1, యూపీపీఎల్‌ కు ఒకరు సభ్యులున్నారు.